ప్రస్తుతం దేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయాని కంటే ముందే అండమాన్ – నికోబార్‌ను తాకబోతున్నాయి. రుతుపవనాలు మే 19 న అండమాన్ నికోబార్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాల వైపు కదులుతాయి. ప్రతి సంవత్సరం రుతుపవనాలు మే 22 నాటికి వస్తాయి. కాని ఈ సారి మూడు రోజుల ముందుగానే రావచ్చని తెలిపారు. అదే సమయంలో, లా నినాతో పాటు, హిందూ మహాసముద్ర ద్విధ్రువ (IOD) పరిస్థితులు కూడా ఈ ఏడాది రుతుపవనాలకు అనుకూలంగా మారుతున్నాయి.
READ MORE: AP CEO MK Meena: పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది..
ఈ నెల ప్రారంభంలో కూడా, మే నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని IMD అంచనా వేసింది. మరో రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాల రాకతో ఈ ఏడాది భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రుతుపవనాలు జూన్ 10 నాటికి మహారాష్ట్రకు చేరుకుంటాయి. జూన్ 15కు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్‌లకు ప్రవేశిస్తాయి. కాగా, జూన్ 20న, ఇది గుజరాత్‌లోని అంతర్గత ప్రాంతాలు, ఎంపీ, ఉత్తర్ ప్రదేశ్ మధ్య ప్రాంతాలను తాకే అవకాశం ఉంది. ఈ కార్యకలాపాలపై వాతావరణ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇది కాకుండా, జూన్ 25 నాటికి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కశ్మీర్‌కు చేరుకుంటాయి. జూన్ 30 న అది రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లకు చేరుతాయి. జూలై 8 నాటికి రుతుపవనాలు మొత్తం దేశాన్ని కవర్ చేస్తాయి.