టెస్టు క్రికెట్ లో 71 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఒక రికార్డును శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బద్దలు కొట్టాడు. గాలే వేదికగా ఐర్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో జయసూర్య ఈ రికార్డును అందుకున్నాడు. రెండో టెస్టు ఐదో రోజు ఆటలో ఐర్లాండ్ బ్యాటర్ పాల్ స్టెర్లింగ్ ను అవుట్ చేయడం ద్వారా జయసూర్య 50 వికెట్ల క్లబ్ లో చేరాడు.
Also Read : Vizag Swetha Case: శ్వేత మృతి కేసు.. కీలకంగా మారిన పోస్టుమార్టం రిపోర్టు
టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల క్లబ్ లో చేరిన బౌలర్ గా అరుదైన రికార్డును ప్రభాత్ జయసూర్య సాధించాడు. ఈ క్రమంలో 71 ఏళ్లుగా వెస్టిండీస్ దిగ్గజం ఆల్ఫ్ వాలైంటైన్ పేరిట ఉన్న రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. 50 వికెట్ల క్లబ్ చేరేందుకు జయసూర్యకు కేవలం 7 టెస్టు మ్యాచ్ లు మాత్రమే అవసరం అయ్యాయి. అదే సమయంలో ఆల్ఫ్ ఈ ఘనతను 8వ టెస్టులో సాధించాడు. ఆల్ఫ్ ఈ రికార్డును 1951-52 మధ్య నెలకొల్పాడు.
Also Read : HairFall : శరీరంలో కొవ్వు పెరిగితే జుట్టురాలుతుందా.. నిజమెంత ?
ఇక రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా సాగుతుంది. ఐదో ఆట లంచ్ విరామానికి ఐర్లాండ్ తమ రెండో ఇన్సింగ్స్ లో 5 వికెట్లకు 121 పరుగులు చేసింది. ప్రస్తుతం 91పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు ఐర్లాండ్ తొలి ఇన్సింగ్స్ లో 492 పరుగులకు ఆలౌటైంది. కర్టీస్ క్యాంపర్ ( 111 ), పాల్ స్టిర్లింగ్ ( 103 ) సెంచరీలతో కదం తొక్కారు. ఆండీ బాల్ బిర్నీ ( 95 ), టక్కర్ ( 80 ) త్రుటిలో శతకాలను చేజార్చుకున్నారు.
Also Read : మీకు బట్టతల ఉందా? అయితే ఈ గింజలు వాడండి
అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక తమ తొలి ఇన్సింగ్స్ ను 3 వికెట్లకు 704 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కుశాల్ మెండీస్ ( 245 ), నిశాన్ మదుశంక ( 205 ) డబుల్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే ( 115 ), మ్యాథ్యూస్ ( 100 నాటౌట్ ) శతకాలతో చెలరేగారు. దాంతో శ్రీలంక 212 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది.