Phone Tapping Case : రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, గట్టుమల్లును అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో డీసీపీ విజయ్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. గట్టు మల్లు గతంలో ఎస్‌ఐబీలో సీఐగా విధులు నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్, గట్టుమల్లు కీలకంగా ఉన్నట్లు వార్తలు సమాచారం. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ప్రభాకర్‌రావు నుంచి వచ్చే ఆదేశాలను ఎప్పటికప్పుడు రాధాకిషన్ పాటించినట్లు.. ప్రభాకర్‌రావు చెప్పిన వ్యాపారులను టాస్క్‌ఫోర్స్ ఆఫీసుకు పిలిచి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో హవాలా నగదుపై నిఘాపెట్టి కొట్టేసినట్లు తెలిసింది. ప్రతిపక్ష నేతల ఇళ్లల్లో నిఘాపెట్టి అధికార పార్టీకి రాధాకిషన్ సమాచారం చేరవేసినట్లు.. ప్రతిపక్ష నేతలను అనధికారికంగా నిర్బందించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌లే ఫోన్ ట్యాపింగ్‌లో కీలక సూత్రదారులు అని వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also: 10th Class Exam: పరీక్షలో ఆన్సర్స్ చూపించలేదని కత్తితో దాడి చేసిన విద్యార్థులు..
ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి, ప్రభుత్వం మారాక హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు వారిపై ఆరోపణలున్నాయి. మరో వైపు భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.