Modi-Putin: భారత ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య త్వరలో భేటీ కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రష్యన్ మీడియాలో విస్తృత కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఇరు దేశాధినేతల మధ్య సమావేశం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మాస్కోలోని భారత రాయబారి పవన్ కపూర్ మాట్లాడుతూ.. ఈ భేటీపై చర్యలు నడుస్తున్నాయని అన్నారు. అయితే ఈ భేటీ ఎక్కడ జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు. చివరిసారిగా గతేడాది ఉజ్బెకిస్తాన్ లో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశంలో ఇరువురు ద్వైపాక్షిక చర్యలు జరిపారు.
Read Also: Tarun Bhasker: బ్రహ్మానందం ఇంటికెళ్లి .. నేను తరుణ్ అని చెప్తే.. అయితే ఏంటి అన్నారు
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇరు దేశాధినేతలు ముఖాముఖిగా మాట్లాడుకున్నది లేదు. యుద్ధ సమయంలో పలుమార్లు ఇరువురు టెలిఫోన్ లో మాట్లాడారు. ఆ సమయంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశిస్తూ.. ఇది యుద్ధాలు చేసుకునే కాలం కాదని సూచించారు. జీ20, బ్రిక్స్ లో సభ్యదేశం అయినప్పటికీ రష్యా అధినేత ఈ సమావేశాలకు హాజరుకాలేదు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా బ్రిక్స్ సదస్సు జరిగింది. జీ20 సమావేశాలను ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా భారత్ నిర్వహించింది. ఈ రెండు సమావేశాలకు పుతిన్ బదులుగా ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు.
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్, రష్యాను వదిలి ఏ దేశాని వెళ్లలేదు. అయితే తాజాగా కిర్గిజ్‌స్తాన్ లో పర్యటించారు. వచ్చే వారం బీజింగ్ లో బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ సమావేశాలకు హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంటర్నెషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) యుద్ధ నేరాల కింద పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే కిర్గిజ్ స్థాన్, చైనాలు ఐసీసీలో సభ్యదేశాలు కావు.