Accenture: ఆర్థికమాంద్యం, ఆర్థిక మందగమనం కారణంగా గతేడాది నవంబర్ నుంచి ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి. కొత్తగా రిక్రూట్మెంట్లను నిలిపేశాయి. కరోనా మహమ్మారి కాలంలో వర్క్ ఫ్రం హోంకి అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని చెప్పాయి, ఒకవేళ ఎవరైనా రాకుంటే ఉద్యోగం ఉండదని హెచ్చరించాయి.
ఇక జీతాల పెంపు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తాజాగా ఐటీ దిగ్గజం ఆక్సెంచర్ భారత్ లోని తన ఉద్యోగులకు ఈ సారి జీతాల పెంపు, బోనస్ ఉండదని ప్రకటించింది. భారత్ తో పాటు శ్రీలంకలోని ఉద్యోగులకు కూడా జీతాల పెంపుదల లేదని ఉద్యోగులకు మెయిల్ పంపింది. అయితే ఈ ప్రకటన అందరికి వర్తించదని తెలిపింది. ఎవరైతే క్రిటికల్ స్కిల్స్ ఏరియాల్లో పనిచేస్తున్న వారికి ఇది వర్తించదని నివేదికలు చెబుతున్నాయి. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే ఆక్సెంచర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ విజ్ ఉద్యోగులకు తెలియజేశారు.
ఐటీ కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో, ఆక్సెంచర్ తన సొంత వృద్ధిని ప్రారంభ ప్రణాళిక కన్నా తక్కువగా పడిపోయిన సమయంలో ఈ ప్రకటన వచ్చింది. అంతకుముందు ఈ ఏడాది మార్చిలో కంపెనీ 19000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. సెప్టెంబర్-ఆగస్టు ఫైనాన్షియల్ ఇయర్ ని అనుసరించే ఆక్సెంచర్.. మునుపటి త్రైమాసికంలో మిశ్రమ ఫలితాలను నివేదించింది. 2024 ఆర్థిక సంవత్సరం గైడెన్స్ గత 16 ఏళ్లలో అతితక్కువ.
Read Also: S Jaishankar: విదేశాంగ మంత్రి జైశంకర్‌కి భద్రత పెంపు.. వై నుంచి “జెడ్ కేటగిరి”గా అప్‌గ్రేడ్..
అయితే ఆక్సెంచర్ పంపిన ఈమెయిళ్లలో.. వ్యక్తిగత పనితీరు ఆధారంగా బోనస్ ఇవ్వబడుతుందని, అయితే ఇది గతేడాది కన్నా తక్కువగా ఉంటుందని పేర్కొంది. ప్రమోషన్లను కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ నెల వరకు అసోసియేట్ డైరెక్టర్(లెవల్ 5) వరకు ప్రమోషన్లు కొనసాగుతాయని, ఇది గతేడాదితో పోలిస్తే తక్కువగా ఉంటుందని తెలిపింది. కంపెనీ గ్రోత్ టార్గెట్లకు అనుగుణంగా 1 నుంచి 4 లెవల్స్ వరకు ప్రమోషన్లు జూన్ 2024 వరకు వాయిదా పడ్డాయి.
ఇక్క ఆక్సెంచరే కాదు.. ఇండియాలో పలు ఐటీ కంపెనీలు జీతాల పెరుగుదలపై మీనమేషాలు లెక్కిస్తున్నాయి. హెచ్‌సీఎల్ గత త్రైమాసికంలో సీనియర్ మేనేజ్మెంట్లకు జీతాల పెంపును దాటవేసింది, జూనియర్ ఉద్యోగుల వేతనాలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.విప్రో తన జీతాల పెంపులను సెప్టెంబరు నుండి డిసెంబర్ 2023 వరకు ఆలస్యం చేసింది మరియు ఇన్ఫోసిస్ ఏప్రిల్ మరియు జూలైలో ప్రారంభంలో అనుకున్న జీతాల పెంపులను ఇంకా అమలు చేయలేదు. ఆక్సెంచర్ కి భారత్ లో 3,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు.