టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిర్వహించిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభ సంతాప సభగా మారింది. పామూరు రోడ్‌లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో.. సభలో గందరగోళం, తొక్కిసలాట చోటు చేసుకోవడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా పలువురు తీవ్రంగా గాయపడటంతో హుటాహుటివారిని ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే చంద్రబాబు తన సభను మధ్యలోనే ఆపేసి, ఆసుపత్రికి వెళ్లారు. బాధితుల్ని పరామర్శించారు.
Also Read : Health Tips : యవ్వనంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
అయితే.. ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటనవల్ల తీవ్రంగా కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు,క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తాం’ అని ప్రధాని మోడీ వెల్లడించారు. అయితే.. ఇదిలా ఉంటే.. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. వారికి పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు.