Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో మూడు విడతలుగా మాజీ ఇంటెలిజెన్స్ అధికారితో పాటు ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావును విచారించిన సిట్, ఆయన నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభించడంలేదని అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు దక్కిన రిలీఫ్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ యోచిస్తోంది. ఇప్పటికే ఆయనపై విచారణలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో, విచారణను మరింత వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని సమాచారం.
ఇక మరోవైపు ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కూడా సిట్ సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా నాంపల్లి కోర్టులో ప్రత్యేక పిటిషన్ వేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే మూడు సార్లు విచారణకు హాజరైన ప్రభాకర్ రావు, అనేక ప్రశ్నలకు “తనకు తెలియదు” అనే సమాధానాలు ఇస్తూ కీలక సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని అధికారులు భావిస్తున్నారు.
విచారణలో ప్రభాకర్ రావు కొంతమంది సీనియర్ అధికారుల పేర్లను ప్రస్తావించడంతో, సిట్ ఇప్పటికే రివ్యూ కమిటీ సభ్యులైన డీజీపీ జితేందర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్లను విచారించి, వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసింది. ఈ వివరాలు ప్రభాకర్ విచారణలో కీలక ఆధారాలుగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరిన వేళ, సిట్ తీసుకుంటున్న చర్యలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
YS Jagan: రాష్ట్రాన్ని బీహార్ చేయాలని చూస్తున్నారు.. కావాలనే చెవిరెడ్డిని ఇరికించారు!