సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తితే.. తప్పుడు కేసులు పెట్టి వేదిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏపీ లిక్కర్ కేసులో ఏడాదిగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు లేదని, ఆయనను ఇరికించేందుకు సడెన్‌గా ఓ కానిస్టేబుల్‌తో తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేశారన్నారు. తన పల్నాడు పర్యటన ముందు రోజు టాపిక్ చేయాలనే ఉద్దేశ్యంతో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. ఈ వయస్సులో రెడ్ బుక్ రాజ్యాంగం పాలన ఏంటి? చంద్రబాబు అని జగన్ ప్రశ్నించారు?. వైఎస్ జగన్ బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటించగా.. ప్రభుత్వం ఆంక్షలు విదించింది. నేడు జగన్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశారు.
‘ప్రజల సమస్యలపై గొంతు విప్పితే చాలు సీఎం చంద్రబాబు వారిని భూస్థాపితం చేస్తా అంటారు. 70 ఏళ్ల వ్యక్తి టీవీ చానెల్‌లోనే నేరుగా అంటున్నారు. ఈ వయస్సులో రెడ్ బుక్ రాజ్యాంగం పాలన ఏంటి?, ఈ బెదిరింపులు ఏంటి?. వాన్ని తొక్కుతా.. వీన్ని తొక్కుతా అనే మాటలు ఏంటి?. దేవుడు అవకాశం ఇచ్చాడు అధికారం వచ్చింది, అయినా మీరు మాట్లాడే మాటలు ఏంటి?. ఏడాది కాలంలో ఏ ప్రభుత్వం చూడని వ్యతిరేకత చంద్రబాబు చూస్తున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తితే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఆ కేసులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. తప్పుడు కేసుల సంప్రదాయాన్ని మరింత కొనసాగిస్తున్నారు. నా పల్నాడు పర్యటన ముందు రోజు టాపిక్ చేయాలనే ఉద్దేశ్యంతో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. సంవత్సరం నుంచి లిక్కర్ కేసులో చెవిరెడ్డి పేరు ఎప్పుడైనా వినిపించిందా?. ఆయనను ఇరికించేందుకు కానిస్టేబుల్‌తో తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేశారు’ అని వైఎస్ జగన్ అన్నారు.
‘చిత్రహింసలు పెడితే కానిస్టేబుల్ జరిగిన సంఘటన చెబుతూ.. డీజీపీ సహా రాష్ట్రపతి, గవర్నర్‌కు లేఖ రాశాడు. కోర్టులో కేసు వేశాడు. నిన్న ఆ కేసు విచారణకు కూడా వచ్చింది. ఏపీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి పేరు ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఆయనను ఇరికించటానికి సడెన్‌గా ఇంకొక క్యారెక్టర్ తీసుకొచ్చారు. గిరి అనే గన్‌మెన్‌తో తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎక్కువసార్లు ఎవరితో అయినా ఫోన్‌లో మాట్లాడినా చాలు.. వాళ్లను తీసుకురావటం, ఏదో ఒక స్టేట్మెంట్ తీసుకుని ఇరికించటం. ఇలా ఇరికించాలనుకుంటే ఎవరినైనా ఇరికించవచ్చు. వాళ్ల దగ్గర పనిచేసే గన్ గన్‌మెన్‌ను పట్టుకుంటే చాలు. నిజంగా లిక్కర్ కేసు దర్యాప్తు ప్రక్రియ చూస్తే సామాన్యుడు బతకలేడు. నిజంగా నక్సలిజం ఇలాగే పుడుతుంది. రాష్ట్రాన్ని బీహార్ చేయాలని చూస్తున్నారు. చెవిరెడ్డిది చంద్రబాబు సొంత జిల్లా కావటం వల్లే ఇరికించారు. ఆఖరికి చెవిరెడ్డి కొడుకు పేరు కూడా తెచ్చారు. కుప్పంలో రాజకీయం చేయాలని చెవిరెడ్డి, ఆయన కొడుకుపై కేసులు పెట్టారు. ఇలాంటి తప్పుడు కేసులతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇరికించారు. నందిగాం సురేష్, మాజీ ఎంపీని జైల్లో ఉంచారు’ అని ఫైర్ అయ్యారు.
Also Read: YS Jagan: రెంటపాళ్ల పర్యటన విజయవంతమైంది.. జనం ఎలా వచ్చారో మీరే చూశారు!
‘వల్లభనేని వంశీని జైల్లో పెట్టి దాదాపు మూడు నెలలు దాటింది.ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు. మా ఓఎస్డీ కృష్ణమోహన్, ధనుంజయ రెడ్డి.. వీళ్లందరిపై తప్పుడు కేసులు పెట్టారు. చంద్రబాబును ఆయన కాలేజ్ టైంలో కొట్టాడని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని అరెస్ట్ చేయాలంటారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు.. వైవీ సుబ్బారెడ్డి, ఆయన కొడుకు..పేర్ని నాని, ఆయన భార్య.. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, దాడిశెట్టి రాజా ఇలా చాలామంది నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టారు. బెదిరించటం, కేసులు పెట్టడం అలవాటైపోయింది. చిన్న చిన్న వాళ్ళను బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని అరెస్ట్ చేస్తున్నారు. అన్నీ తప్పుడు కేసులు.. తప్పుడు అరెస్టులు’ అని జగన్ మండిపడ్డారు.