Perni Nani : తమపై ఎన్ని కక్షపూరిత కేసులు పెట్టినా భయపడేది లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం మచిలీపట్నంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో సివిల్ సప్లై శాఖలో ఎన్నడూ లేని విధంగా తమపై క్రిమినల్ కేసులు పెడుతున్నారంటూ వాపోయారు. అసలు చట్టం ప్రకారం ఎవరిపై పెట్టకూడని కేసులు తన కుటుంబంపై పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వేధింపులు తనకు కొత్తేం కాదని.. కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఎన్ని వేధింపులకు గురి చేసినా మాజీ సీఎం జగన్ ను వీడేది లేదని తేల్చి చెప్పారు.
Read Also : HCU Land Issue: టెన్షన్.. టెన్షన్.. బీజేపీ ఎమ్మెల్యేలు అరెస్ట్.. వర్సిటీ వద్ద భారీగా పోలీసులు..
సివిల్ సప్లై శాఖ మంత్రి స్వయంగా వెళ్లి టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని పట్టుకుంటే వారిపై ఎందుకు క్రమినల్ కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లి సీజ్ ది షిప్ అన్న కేసుల్లో కూడా ఎందుకు క్రిమినల్ సెక్షన్లు 6(A) పెట్టలేదని అడిగారు. తనపై పెట్టింది వేధింపులు కేసు మాత్రమే అని.. అది చట్టం ప్రకారం క్రిమినల్ కేసు కాదన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను ఎన్నడూ భయపడలేదని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల ఇళ్ల చుట్టూ పోలీసులే ఉంటున్నారని.. అరెస్ట్ చేయడమే వారి పనిగా మారిపోయిందన్నారు.