Perni Nani: చంద్రబాబు విజన్ 2020 ఏమైంది అని నిలదీశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు 2047 విజన్ డాక్యుమెంట్ అని హడావిడి చేస్తున్నాడు.. ఇండియా, ఇండియన్స్, తెలుగియన్స్ అని అన్నాడు.. తాను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాడట.. మరి తన హయాంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించమని ఆందోళనలు చేస్తే కాల్పులు చేయించిన వ్యక్తి ఈయన కాదా? అని మండిపడ్డారు. 22 వేల కోట్ల విద్యుత్ కొనుగోలు బకాయిలను ప్రజలపై పెట్టి వెళ్లిన వ్యక్తి చంద్రబాబేనని విమర్శించిన ఆయన.. వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోవటానికే తీగలు పనికి వస్తాయని కామెంట్ చేశాడు ఈ విజనరీ అని గుర్తుచేశారు.
Read Also: Supreme Court: కృష్ణ జన్మభూమిలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై సుప్రీం స్టే
ఇక, విజన్ 2020లో వ్యవసాయాన్ని తగ్గిస్తానని చంద్రబాబు చెప్పాడు.. మరి ఇవాళ 63 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు.. మరి చంద్రబాబు 2020 విజన్ ఏమయ్యింది అని ప్రశ్నించారు పేర్ని నాని.. మరోవైపు స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) గొప్ప నాయకుడు అని చంద్రబాబు చెబుతున్నాడు.. గొప్ప నాయకుడు అయితే ఎందుకు వెన్నుపోటు పొడిచారు? అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు తంతు ఉట్టికి ఎగిరలేనమ్మ.. ఆకాశానికి ఎగిరింది అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. 14 ఏళ్ల పాలనలో చిత్తూరు జిల్లాకు, కనీసం కుప్పానికి అయినా నీళ్లు ఇచ్చావా? అని నిలదీశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తాను పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు పేరు అయినా చెప్పగలడా ? చంద్రబాబు పథకం అని చెప్పటానికి ఒకటైనా ఉందా? సొంత ఊరు నారావారి పల్లెలో అయినా ప్రభుత్వ స్కూల్ ను బాగు చేశాడా?ఒక్క కొత్త స్కూల్ అయినా తెరిచాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లను మూసి వేయటమే చంద్రబాబు విజన్ అని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాన్ని.. విద్యను వ్యాపారం చేసిన నారాయణ సంస్థకు అప్పగించటం దారుణం కాదా? అని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు తెలిసిందల్లా పబ్లిసిటీ పథకం మాత్రమే నంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.