గౌడ్‌ల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే.. 40 లక్షల తాటి మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. గీత కార్మిక బిడ్డగా తాను మంత్రిగా పని చేస్తున్నా అని, రాబోయే కాలంలో అందరూ ఉన్నత స్థానంలో కొనసాగేలా కష్ట పడండని సూచించారు. కుల వృత్తి పరంగా చేసేవారు చేయండని, కానీ పిల్లలకు చదువే ప్రధానంగా ఉండేలా చదివించాలన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కులాలకు అవకాశం ఇచ్చిందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణంకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు శంకుస్థాపన చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ‘గౌడ్‌లకు సంబంధించి కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలని నన్ను, మహేష్ కుమార్ గౌడ్‌ను బాలసాని లక్ష్మీ నారాయణ కలిశారు. ప్రభుత్వం గౌడ్‌ల సంక్షేమం కోసం పని చేస్తుంది. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మంత్రుల వద్ద మాట తీసుకున్నా. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కాంట్రిబ్యూషన్ ఎక్కువ తీసుకుంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. 6 కోట్లతో తెలంగాణలో రెండవ స్థానంలో నేను నిర్మించిన గౌడ భవన్ ఉంటుంది. వేములవాడలో 45 రూమ్‌లతో సత్రం కడుతున్నాం. కుల వృత్తి పరంగా చేసేవాళ్లు చేయండి కానీ.. పిల్లలకు చదువే ప్రధానంగా ఉండేలా చదివించాలి’ అని అన్నారు.
Also Read: Minister Seethakka: ప్రతి మహిళా ఎస్‌హెచ్‌జీలో ఉండాలి.. కలెక్టర్లకు మంత్రి సీతక్క ఆదేశాలు!
‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే 40 లక్షల తాటి మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసింది. కులగణన జరిగే సమయంలో ఎందుకు అని అందరూ ప్రశ్నించారు. నిన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా ప్రభుత్వం అన్ని కులాలకు అవకాశం ఇచ్చింది. గీత కార్మిక బిడ్డగా నేను మంత్రిగా పని చేస్తున్నా. రాబోయే కాలంలో అందరూ ఉన్నత స్థానంలో కొనసాగేలా కష్టపడండి. ముగ్గురు మంత్రుల కోసం, ఎంపీ కోసం పని చేయండి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.