జనసేన పార్టీ 11ఏళ్లు పూర్తి చేసుకుని 12 ఏట అడుగు పెట్టింది. నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. జనసేన 12 ఏళ్ల పండుగ వైభవంగా సాగుతోంది.. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేస్తారు. సభలో 90 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు.. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. కూటమితో జతకట్టి 100% స్ట్రయిక్ రేట్ సాధించిన విషయం తెలిసిందే. జనసేన భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి పార్టీ సభ కావడంతో పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది. అయితే మనం ఇప్పుడు జనసేన ప్రస్తానం గురించి పూర్తిగా తెలుసుకుందాం…
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్తానం…
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. అదే పార్టీకి చెందిన వింగ్ యువరాజ్యం. ఈ యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షుడిగా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ నియమితులయ్యారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా తొలి అడుగు పడింది ఇక్కడే. అయితే ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో పోటీ చేసి.. 18 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. పలు కారణాల వల్ల ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఇది పవన్‌కు నచ్చలేదని అప్పట్లో వార్తలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తుందని పవన్ కళ్యాణ్ బలంగా నమ్మారు. ఈ విషయాన్ని 2014 ఎన్నికల ప్రచారంలో పలు మార్లు పవన్ ప్రస్తావించారు. హస్తం పార్టీ అరాచకాలను అడ్డుకోవడమే తన ఎజెండా అని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో పరుడు పోసుకున్న జనసేన..
ప్రజారాజ్యం పార్టీ విలీనం అనంతరం పవన్ కొత్త పార్టీని స్థాపించాలని నిర్ణయించారు. అప్పుడే జనసేన పార్టీ ఉద్భవించింది. 2014 మార్చి 14న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ ఆవిర్భవించింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని నోవోటెల్ హోటల్లో జనసేన పార్టీని పవన్ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జనసేన పురుడు పోసుకుంది. జనసేన అంటే ప్రజా సైన్యం అని అర్థం. పార్టీ ఆవిర్భావం అనంతరం ఎన్నికల్లో పోటీ చేస్తుందని చాలా పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకున్నారు. కానీ.. 2014 ఎన్నికలల్లో జనసేన ప్రత్యేక్షంగా పోటీ చేయలేదు. ఇతర పార్టీలకు మద్దతునిచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండేళ్ల తర్వాత.. ఇతర పార్టీలకు తన మద్దతును విరమించుకున్నారు పవన్. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదనీ, టీడీపీ కూడా ప్రశ్నించడం లేదని గళమెత్తారు. ప్రతిపక్ష పార్టీగా మారి ప్రశ్నించడం ప్రారంభించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ బీఎస్పీ, వామపక్ష పార్టీలతో దోస్తి చేసింది. మొత్తం 134 సీట్లలో బరిలోకి దిగింది. కానీ.. కేవలం జనసేనకు ఒక్క సీటు మాత్రమే వచ్చింది. తూర్పు గోదావరి జల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ జనసేన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. కొంత కాలం తర్వాత వరప్రసాద్ వైసీపీకి మద్దతుదారుగా మారారు.
2019 ఎన్నికల్లో ఓటమి పాలైన పవన్ కళ్యాణ్..
2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగారు. అభిమానులందరూ తప్పకుండా గెలుస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. రెండు చోట్ల పవన్ ఓడిపోవడం సంచలనంగా మారింది. పార్టీని స్థాపించిన వ్యక్తి, అధ్యక్షుడే ఓటమి పాలవ్వడంతో హేళన చేయడం మొదలు పెట్టారు. కానీ.. పవన్ ఎక్కడా తగ్గలేదు.. ఎంత మంది హేళన చేసినా వెనకడుగు వేయలేదు.. ప్రజా సమస్యలపై ఉద్యమించడం మొదలు పెట్టారు. ఏపీలో వైఎస్ జగన్ పాలనకు ఆరు నెలలు పూర్తి కాకముందే.. ‘ఇసుక సంక్షోభం’ కారణంగా కూలీలు పనులు దొరకక ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ సమస్యపై పవన్ దృష్టి పెట్టారు. ఈ సమస్యను లేవనెత్తుతూ విశాఖలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
అయినా తగ్గని జనసేనాని..
పలువురు టీడీపీ నాయకులు సైతం జనసేనానికి మద్దతు పలికారు. ఈ ఉద్యమంతో రాష్ట్రంలో అధికార పార్టీ వైఎస్‌ఆర్సీపీకి ఒత్తిడి మొదలైంది. జనాల్లోకి నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. రైతు సంక్షేమం, మహిళల రక్షణ, భూ ఆక్రమణలు వంటి సమస్యలసై ఫోకస్ పెట్టారు. పార్టీ సభలు నిర్వహిస్తూ.. ప్రజా సమస్యలపై పవన్ గళమెత్తేవారు. ఆయన ఉపన్యాసం యువతకు గూస్‌బంప్స్ తెప్పించింది. రాను రాను జనసేనాని విధానం మారుతూ వచ్చింది. 2019లో వామపక్షాలతో దోస్తీ చేసిన పవన్ నెమ్మదిగా బీజేపీ సిద్ధంతాల వైపునకు రావడం మొదలు పెట్టారు. సనాతన ధర్మాన్ని పాటిస్తూ.. దాని విశిష్టతను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. 2014లో పార్టీ పెట్టినప్పుడు చే గువేరాను అనుసరించిన పవన్ 2024 వచ్చే సరికి అంటే పదేళ్ల తర్వాత సనాతన ధర్మానికి జై కొట్టారు.
టీడీపీ, బీజేపీతో దోస్తీ..
ఎన్ని ఉద్యమాలు, ఆందోళనలు చేసిన రాజకీయంగా ఇంకా నిలదొక్కుకోలేడనే విమర్శలు ఎదుర్కొన్నారు పవన్. నెమ్మదిగా.. పవన్ కళ్యాణ్ కేంద్రంలో బీజేపీతో, రాష్ట్రంలో టీడీపీతో ఉంటున్నారని.. వైసీపీ విమర్శించేది. అదే వాస్తవమవుతూ వచ్చింది. 2023 సెప్టెంబరులో స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రిని రాజమండ్రి జైలుకు తరలించగా.. ఆయన్ని చూడడానికి పవన్ వెళ్లారు. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీని అంతమొందించాలంటే తన ఒక్కడి బలం సరిపోదని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ తనకు ఒక అన్నలా అండగా నిలబడ్డారంటూ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అక్కడే టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారని భావించారు.
జనసేనకు 100 శాతం స్ట్రయిక్ రేట్..
అవును అదే నిజమైంది. ఊహాగానాలు, అభిప్రాయాలు కాస్త నిజయమయ్యాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేశాయి. వైసీపీ పార్టీకి చుక్కలు చూపించాయి. వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశాయి. ఒక్క సీటుకే పరిమితమైన జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రయిక్ రేట్ సాధించింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీచోటా గెలుపొందింది. జనసేన పార్టీ 100 శాతం విజయాలను నమోదు చేసి ఎన్డీయే కూటమిలో కీలకంగా మారింది. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు లభించగా అన్నింటిలో ఘన విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈసారి 70వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవితో పాటు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ విజయాన్ని నేడు ఘనంగా నిర్వహించుకుంటున్నారు.