Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులు, ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన పవన్.. ఆ తర్వాత జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక కామెంట్లు చేశారు.. లెఫ్ట్ అండ్ రైట్ పార్టీలతో కలిసే వైసీపీపై పోరాటం చేయాలనే నాకుంది.. కానీ, ఎవరి సిద్ధాంతాలు వారికి ఉంటాయన్నారు.. వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రభావితం చేసే పార్టీలు కలవాలని కోరుకుంటున్నాం అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు పొత్తులతోనే బలపడ్డాయని వ్యాఖ్యానించారు.. ప్రతి పార్టీకి వారి వారి ఓట్లు.. వారి వారి బలం ఉంటుంది. కానీ, కలిసి వెళ్తే మరింత బలంగా పోరాడవచ్చు అన్నారు.
ఇక, ఉనికి చాటుకోవడానికి పార్టీ పెట్టలేదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.. లోతుగా ఆలోచించే గతంలో టీడీపీకి సపోర్ట్ చేశానన్న ఆయన.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని మరోసారి స్పష్టం చేశారు.. మాకు గత ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు వచ్చాయి.. మేం గత ఎన్నికల్లో 137స్థానాల్లో పోటీ చేశామని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తామంటే ఒప్పుకోబోమన్నారు పవన్.. కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటాం.. ఎవరైనా పొత్తులకు ఒప్పుకోకుంటే ఒప్పిస్తామని ప్రకటించారు.. సీఎం అభ్యర్థి అయితేనే పొత్తులు పెట్టుకోవాలనుకునే వాళ్లు.. గత ఎన్నికల్లో మమ్మల్ని కనీసం 40 స్థానాల్లో గెలిపించి ఉండాల్సింది అన్నారు పవన్ కల్యాణ్.
కనీసం 30-40 స్థానాలుంటేనే సీఎం అభ్యర్థిగా ఉంటామని అనగలం అన్నారు జనసేనాని.. మేం ఒక కులం కోసం పని చేసే పార్టీ కాదన్న ఆయన.. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేపడతామని ప్రకటించారు.. మా బలం మీదే ఆధారపడి సీట్ షేరింగ్ ఉంటుందని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో మా బలం ఎక్కువ.. కొన్ని జిల్లాల్లో తక్కువ.. కానీ, జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తామని తెలిపారు.. ఇక, సీఎం కావాలనుకుంటే సీఎం అయిపోరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.. నన్ను సీఎంని చేయాలని టీడీపీనో.. బీజేపీనో అడగబోనన్న ఆయన.. నా సత్తా ఏంటో చూపించి అడుగుతానని పేర్కొన్నారు..
ఇక, పొత్తులపై అన్ని రకాల సందేహాలకు.. విమర్శలకు సమాధానం ఇచ్చారు పవన్ కల్యాణ్.. పొత్తులు కచ్చితంగా ఉంటాయని తేల్చి చెప్పారు జనసేనాని. పొత్తుల పట్ల విముఖతతో ఉన్న పార్టీలను అవసరమైతే ఒప్పిస్తామంటూ స్పష్టం చేశారు.. సీఎం అభ్యర్థి డిమాండ్ అనేది పొత్తులకు ప్రామాణికం కాదని క్లారిటీ ఇచ్చిన పవన్. బలాన్ని బట్టే సీట్ షేరింగ్ అంటూ తేల్చేశారు.. నా అభిప్రాయాలను.. నిర్ణయాలను గౌరవించి.. అర్థం చేసుకున్న వాళ్లే నా వాళ్లూ అంటూ కీలక వ్యాఖ్యాలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.