Pawan Kalyan: తూర్పు గోదావరి జిల్లా పర్యటన నిమిత్తం జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి విచ్చేశారు. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ బయట పవన్ కల్యాణ్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనసేన పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పవన్ కు అభిమానులు గజమాలలు వేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక, ఎయిర్‌పోర్ట్ నుండి భారీ ర్యాలీతో రాజమండ్రి చేరుకున్నారు. షెల్టన్ హోటల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ముఖ్య నేతలు పవన్ ను కలుసుకున్నారు. పలువురు జనసేన పార్టీ నేతలు పవన్ ను కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాత్రికి పవన్ కల్యాణ్ రాజమండ్రిలోనే బస చేస్తున్నారు.. రేపు మరోసారి ఉదయం నుండి పార్టీ ముఖ్య నేతలతో టిక్కెట్లు, అభ్యర్థులు, జనసేన పోటీ చేసే స్థానాలపై సమీక్ష నిర్వహించనున్నారు పవన్ కల్యాణ్.
Read Also: Tamil Nadu: హీరో విజయ్ పార్టీ కీలక భేటీ.. నిర్ణయాలివే..!
మరోవైపు జనసేనాని.. భీమవరం పర్యటన మరుసటి రోజుకు వాయిదా పడింది.. అంటే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 20వ తేదీన ఆయన భీమవరం వెళ్లాల్సి ఉండగా.. 21వ తేదీ ఉదయం హెలికాప్టర్‌లో భీమవరం చేరుకోనున్నారు పవన్.. రాజమండ్రిలో కొన్ని కార్యక్రమాలు పెరగడం మూలంగా పవన్ పర్యటన ఆలస్యం అవుతున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. భీమవరంలో పవన్ కల్యాణ్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. ఇక, ఈ రోజు విశాఖలో పర్యటించిన పవన్ కల్యాణ్.. విశాఖపట్నం నుంచి రాజమండ్రికి చేరుకున్నారు.