జనసేన వారాహి యాత్ర కొనసాగుతోంది.. ఓవైపు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెడుతూనే.. మరోవైపు జనవాణి పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.. ఇక, బహరంగ సభల్లో అధికార పార్టీ నేతలను టార్గెట్ చేసి ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు పశ్చిమ గోదావరి నరసాపురం నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాను.. మార్పుకోసం పంతం పట్టి కొనసాగుతున్నా.. సమాజంలో విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు చాలా అవసరం.. ఈ మూడు కొద్ది మంది చేతుల్లోకి వెళ్లి.. మిగతా వాళ్లు దేహి అనే పరిస్థితిలో ఉండకూడదని ఉద్దేశంతో జనసేన స్థాపించానని తెలిపారు. ఎక్కడ చూసినా ఇసుక దోచేస్తున్నారు.. దీని వల్ల పర్యావరనానికి ముప్పు ఏర్పడుతుంది. ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది.. ఆక్వా వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నియంత్రించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆక్వా కాలుష్యం వల్ల ఆరోగ్యం అనేది పెద్ద సమస్యగా మారిపోతుందన్నారు పవన్ కల్యాణ్.. గోదావరి జిల్లాలో కేరళ తరహా టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.. కానీ, పెట్టుబడి పెట్టేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లాంటివాళ్ళు వ్యాపారాలు చే..స్తూ తమ స్వార్థం చూసుకుంటున్నారని విమర్శించారు. నేను పార్టీ నడుపుతూ దెబ్బలు తిన్నాను తప్ప కార్యకర్తల ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం వాటిల్లకుండా చూడగలిగాను అన్నారు. డబ్బులు ఖర్చు చేయకుండా అభిమానులు కార్యకర్తల ప్రేమాభిమానాన్ని జనసేన పార్టీ సొంతం చేసుకోగలుగుతుందని వెల్లడించారు.
గోదావరి మీద ఆనకట్ట కట్టాలని కాటన్ ఒక్కడు పూనుకుంటే పని పూర్తి చేయగలిగారు.. అలా రాష్ట్రం కోసం ఇక్కడి ప్రజల కోసం కొంతమంది ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు పవన్.. పదవులకోసం పార్టీని తాకట్టు పెట్టలేం.. కనీసం విదేశాల్లో తరహా డంపింగ్ యార్డులు కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారని మండిపడ్డారు.. రాజకీయాలంటే ఎంతసేపు బూతుల తిట్టుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం గా మార్చేశారని ఆరోపించారు. అందరి దృష్టి , దిష్టి గోదావరి జిల్లాల పైన పడింది.. దీని నుంచి విముక్తి కల్పించేందుకు గోదావరి జిల్లాల నుంచి పోరాటం మొదలు పెట్టానని వెల్లడించారు. ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకూడదని లక్ష్యాన్ని పెట్టుకున్నామని పేర్కొన్నారు. ముఖ్య మంత్రి 18 ఏళ్ల వయసులో చేసిన అరాచకాలను తీసుకొని ఇప్పటి వైసీపీ నాయకుల పిల్లలు డీఎస్పీ, ఎస్పీలను కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదుటి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మనం నోరు ఎత్తకపోతే మనకి అన్యాయం జరిగినప్పుడు ఎవరు రారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.