Parigi : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ అధికారుల చర్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం తుంకులగడ్డ ప్రాంతంలో ప్రభుత్వంచే కేటాయించిన ఇళ్ల స్థలంలో లబ్ధిదారుడు ఇల్లు నిర్మించేందుకు బునాది గోడలు నిర్మిస్తుండగా, పరిగి తహసీల్దారు జేసీబీతో వచ్చి వాటిని ధ్వంసం చేశారు. అంతేకాదు, ఈ ఘటనను వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి సెల్‌ఫోన్‌ను లాక్కొనడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై స్థానికులు అధికారుల తీరును తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.
2002లో సర్వే నంబర్ 530లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి, అప్పటి తహసీల్దార్ వారికీ సర్టిఫికెట్లు అందజేశారు. అయితే ఆర్థిక కారణాల వల్ల చాలా మంది అప్పట్లో ఇళ్లు నిర్మించలేకపోయారు. ఇప్పుడు, కొంతమంది తమ స్థలాల్లో బునాది వేస్తే, తహసీల్దార్ ఆనంద్ జేసీబీ సహాయంతో గోడలను కూల్చివేయడం స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
తహసీల్దార్ ఆనంద్ మాట్లాడుతూ, అప్పటి ఇళ్ల స్థలాల సర్టిఫికెట్లు చెల్లుబాటు కానివని, అవి ఫేక్ సర్టిఫికెట్లుగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా, “ఇళ్ల స్థలాలను కేటాయించినప్పుడు మూడు సంవత్సరాల్లోపు ఇల్లు నిర్మించాలి. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కట్టుకుంటే, ఆ స్థలం తిరిగి ప్రభుత్వ అధీనంలోకి వెళ్తుంది” అని స్పష్టం చేశారు. ఇక, పేదలకు అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో కొంతమంది ఇళ్లను నిర్మించుకుని జీవనం సాగిస్తుండగా, ఇప్పుడే కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టే వారికి అడ్డంకులు ఎందుకు పెడుతున్నారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం నెలకొంది.
Kesineni Chinni: విశాఖ స్టేడియం పేరు మార్పు వివాదంపై వైసీపీకి టీడీపీ కౌంటర్..