Kaile Anil Kumar: టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్.. ఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్లపట్టాలను చంద్రబాబు అడ్డుకుంటున్నాడు.. పేదలకు ఇళ్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు.. పేదలు ఇళ్లు కట్టుకోకూడదనేది చంద్రబాబు ఆలోచన.. 50 వేల పైచిలుకు పేదలకు జగన్ మోహన్ రెడ్డి ఇళ్లపట్టాలిచ్చారు.. పేదల ఇళ్లను కట్టేందుకు కేంద్రం నుంచి అనుమతి తెచ్చారు.. అన్ని వర్గాల ప్రజలుంటేనే అది ప్రజా రాజధాని అన్నారు.. కానీ, రాజధానిలో తన వర్గం మాత్రమే ఉండాలనేది చంద్రబాబు ఆలోచన అని మండిపడ్డారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో అద్దెలు కట్టలేక సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన.. యుద్ధప్రాతిపదికన ఇళ్లను పూర్తిచేసేందుకు షేర్ వాల్ట్ టెక్నాలజీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు.. ఇళ్లు కట్టకూడదనే దుర్భుద్ధితో చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు.. చంద్రబాబుకు పేదలపై కోపం అని విమర్శలు గుప్పించారు.
పేదలు ఇళ్లు కట్టుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదు.. మురికివాడలుగా మారిపోతాయని అంటున్నాడు.. పేదలంటే చంద్రబాబుకు చులకన భావన అని ఆరోపించారు అనిల్ కుమార్. పేదల జీవన ప్రమాణాలు పెంచాలనే ఆలోచన ఏనాడూ చంద్రబాబు చేయలేదన్న ఆయన.. పేదలకు పథకాలు పప్పూ బెల్లాల్లా పంచేస్తున్నారంటాడు.. వాలంటరీ వ్యవస్థ పై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో సచివాలయ వ్యవస్థ ఎంతో కీలకమన్న ఆయన.. గతంలో సంక్షేమ పథకాలు తీసుకునే వారంటే సమాజంలో చాలా చిన్నచూపు ఉండేది.. కానీ, ఈరోజు ప్రజల వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తున్నాం.. గతం కంటే పేదల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి.. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నుంచి పేదలపై చంద్రబాబు దాడులు చేస్తున్నాడని విమర్శించారు.
ఇక, జగన్ వెంట సైనికుల్లా ఉండి పోరాడతాం అని ప్రకటించారు కైలే అనిల్ కుమార్.. రాజధానిలో బయటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇళ్లపట్టాలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల ప్రజలు బయటి ప్రాంతాల వారా? అని నిలదీశారు. పేదలకు ఇళ్లిచ్చి మురికివాడలుగా చేయాలని చూస్తున్నారంటూ చేస్తున్న విమర్శలు బాధాకరం.. పేదలకు ఇచ్చిన ఇళ్ల పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకే చోట 50 వేల మందికి ఇళ్లు కట్టించడం ఓ యజ్ఞం.. కానీ, కులాలను రెచ్చగొట్టడం.. లబ్ధిపొందడం చంద్రబాబుకి అలవాటు అని మండిపడ్డారు. దళితులంటే చంద్రబాబుకి చాలా చులకన భావం.. ఎస్సీల పై చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు అనేక మార్లు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.. సెంటు భూమి సమాధులకు కూడా పనికిరాదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఎంత బాధపడ్డారో అందరూ గుర్తు చేసుకోవాలన్న ఆయన.. ఇదే సమయంలో దళితులెవరూ చంద్రబాబును విశ్వసించరని జోస్యం చెప్పారు.. పేదల కోసం జగన్ మోహన్ రెడ్డి చేసే ప్రయాణంలో మేం సైనికులుగా నిలబడతాం అని ప్రకటించారు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్.