సన్నాహాక సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్ట కాలంలో గులాబీ జెండా ను గద్దేనెక్కించింది ఘనపూర్ గడ్డా అని ఆయన అన్నారు. మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి అని ఆయన విమర్శించారు. తొక్కల మినిస్టర్ నాలుగు సార్లు చేసి డిగ్రీ కళాశాల తేలేదని, ఘనపూర్ కు ఎక్కువ నష్టం చేసిన కడియం ను రాజకీయ సమాధి చేయాలన్నారు పల్లా. మున్సిపాలిటీ,టెక్స్టైల్ పార్కు, సైనిక్ స్కూల్ రాకుండా అడ్డుపడ్డాడని, బిచ్చగాడిలా డబ్బులు తీసుకున్నావని ఆయన విమర్శించారు. నీతి, నిజాయితీ అని చెప్పడం కాదు.. రాజీనామా చేసి రా.. అని ఆయన సవాల్ విసిరారు. నీ వల్ల లాభం పొందినవారు తెలంగాణ లో ఎవ్వరూ లేరని, బీఆర్‌ఎస్ అభ్యర్థికి కనీసం సొంత ఇల్లు కూడా లేదన్నారు. డాక్టర్ సుధీర్ కుమార్ ను గెలిపించాలని ఆయన కోరారు. నీతిమంతునికి , అవినీతి మంతునికి మధ్య జరిగే ఎన్నికలు అని ఆయన అన్నారు. కడియం తో పొల్చకండని ఊసరవెల్లి కూడా మొత్తుకుంటుందట అని ఆయన మండిపడ్డారు.
ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలైన రూ.2లక్షల రుణమాఫీ, 24 గంటల నాణ్యమైన కరెంటు, రూ.15వేల రైతు భరోసా, ధాన్యానికి రూ.500 బోనస్, పింఛన్లు రూ.4వేలకు పెంపు తదితర అంశాలను బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్ నాయకుల అసలు స్వరూపాన్ని ఎండగట్టాలన్నారు. ప్రజలకు చెప్పిన మాటలు, రైతులకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అడిగిన ప్రజలను మంత్రులు, ఎమ్మెల్యేలు దబాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.