ఇజ్రాయెల్ -ఇరాన్ ఘర్షణ సంక్లిష్ట రూపం దాల్చిన నేపథ్యంలో.. అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి ‘ఆపరేషన్ సింధు’ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుంచి 10 మంది ఏపీ విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి వచ్చే బాధితుల కోసం విదేశాంగశాఖ ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి వచ్చే బాధితుల కోసం ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌లలో రెండు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. విద్యార్థులను ఢిల్లీ నుంచి స్వస్థలానికి పంపేందుకు రెసిడెంట్ కమిషనర్లు 2 టీమ్‌లను నియమించారు. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన విదేశాంగ శాఖ ఇప్పటి వరకు దాదాపు 1750 మంది భారతీయులను ఇరాన్ నుండి స్వదేశానికి చేర్చింది. ఇప్పటికే బీహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుండి విద్యార్థులు వచ్చారు.