Crime News: కేవలం రూ.9వేల రూపాయలకోసం బావ బావమరిదిల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. ఇరువురి తరపున వర్గీయులు పరస్పర దాడులకు పూనుకున్నారు. ఈ ఘటనలో ఒకరు హత్యకు గురికాగా, మరో ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు. దాడికి పాల్పడ్డ 18మంది నిందితుల్లో 12మందిని శాలిబండా పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్‌కు తరలించారు. పురాణా హవేలిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో సౌత్ జోన్ డీసీపీ స్నేహ వివరాలను వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన మజర్, సోహైల్‌లు బావ బావమరిదిలు. గత కొంత కాలంగా వీళ్లిద్దరి మధ్య డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మజర్ సోహైల్ వద్ద రూ.9వేల రూపాయలను అరువుగా తీసుకుని సతాయిస్తున్నాడు.
Read Also: Kadapa Crime: తల్లితో సహజీవనం.. నిలదీసిన కొడుకు దారుణ హత్య..
దీంతో ఈ నెల 18వ తేదీన రాత్రి పాతబస్తీ మక్కా కాలనీలోని ఫ్యాన్సీ చికెన్ సెంటర్‌లో డబ్బుల విషయమై వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఆ వివాదం కాస్త చిలికి చిలికి హింసాత్మకంగా మారింది. సోహైల్ తరపున వచ్చిన వాజిద్‌పై మజర్ వర్గీయులు కాలాపత్తర్‌కు చెందిన రౌడీషీటర్ 14 కేసులలో నిందితుడైన మొహమ్మద్ అసద్ (35), నాలుగు కేసులలో నిందితుడైన హుస్సేన్ పాషా అలియాస్ అషు (23), మొహమ్మద్ సుభాన్ ఖాన్(20), మొహమ్మద్ అన్వర్ అలియాస్ అన్న (34), మేషాన్ బిన్ సమద్ మిశ్రీ (32), ఇమ్రాన్, గౌస్ , మొహ్మద్ అబ్నాన్ ఉద్దీన్ (26), సోహైల్, మొహమ్మద్ ఇస్మాయిల్ అలియాస్ ఖుర్రం (37), సైఫ్ ఆలీఖాన్ అలియాస్ అర్బాస్ (21), అబ్దుల్లాఖాన్ (18), షేక్ దస్తగిర్ (20), సయ్యద్ యాకుబ్ ఆలీ (19), ఉస్మాన్ బిన్ ఖాళీద్ యామని (22), అమన్ ఆలీ హాష్మి (18), దస్తగిరిలు కత్తులతో అటాక్ చేసి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వాజిద్‌కు సహాయం చేయడానికి అతని సోదరులు సాజిద్, ఖదీర్‌లు అక్కడికి వచ్చారు. వాళ్లపై కూడా కత్తులతో దాడిచేశారు. ఆ సమయంలో ఫాతిమా ఆసుపత్రి దగ్గరి నుంచి వెళ్తున్న సయ్యద్ ఫకృద్దీన్ అలియాస్ రఫిక్ అలియాస్ షిమ్లాన్ పైన కూడా కత్తులతో దాడికి తెగబడ్డారు.ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సయ్యద్ ఫకృద్దీన్ అక్కడిక్కడే మృతిచెందగా, వాజిద్, సాజిద్, ఖదీర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 18మంది పై శాలిబండా పోలీసులు కేసులు నమోదు చేశారు. 18మందిలో 12మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.