అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ వ్యూహం మారిందా? ఎక్కడ నెగ్గాలో కాదు…. ఎక్కడ తగ్గాలో తెలిసుండాలన్న డైలాగ్‌ని గుర్తు చేసుకుంటోందా? తమ సభ్యుడి సస్పెన్షన్ బహిష్కరణదాకా వెళ్లకుండా ఉండాలంటే… ముందు తాము మారామని నిరూపించాలని గులాబీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా? కారు పార్టీ కొత్త ప్లాన్ ఏంటి? ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంది? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన మాటల్ని తీవ్రంగా పరిగణించిన అధికార పక్షం… సభాపతి అంటే.. గౌరవం లేకుండా మాట్లాడారని, అందుకే విపక్ష సభ్యుడి మీద అనర్హత వేటేయాలని సూచించారు. ఇదే సమయంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రి శ్రీధర్ బాబు…ఈ సమావేశాల వరకు సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దాన్ని ఆమోదించిన స్పీకర్… వెంటనే సభ నుంచి బయటికి వెళ్లి పోవాలని జగదీశ్ రెడ్డికి సూచించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్‌లో కూర్చున్నా… అక్కడ కూడా ఉండకూడదు, పూర్తిగా అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవాల్సిందేనని సిబ్బంది సూచించడంతో మరో గత్యంతరం లేక వెళ్ళిపోయారాయన. ఈ పరిస్థితుల్లో… హోలీ హాలిడే తర్వాత… శనివారం జరిగిన సభలో బీఆర్‌ఎస్ సభ్యుల వైఖరి పూర్తి భిన్నంగా కనిపించింది. సభ ప్రారంభం కంటే ముందే వెళ్లి స్పీకర్‌ను కలిసి లెటర్ ఇచ్చి వచ్చారు విపక్ష ఎమ్మెల్యేలు. జగదీశ్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు ఎత్తేయాలని, సభలోకి పిలవాలని కోరారు. ఇక సభ మొదలైన వెంటనే మాట్లాడిన హరీష్ రావు సభాపతి అంటే తమకు చాలా గౌరవం ఉందని, ఎన్నిక జరిగిన సమయంలో తాము ఏకగ్రీవంగా అంగీకరించామని గుర్తు చేశారు. తమ అధ్యక్షుడు కేసీఆర్ కూడా సభాపతి విషయంలో గౌరవంగా ఉండాలని సూచించినట్టు తెలిపారాయన. ఈ విషయమై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మధ్య గట్టి చర్చే జరుగుతోందట. సభలో జాగ్రత్తగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు సస్పెన్షన్లు మొదలవలేదుగానీ…. జగదీశ్ రెడ్డితో మొదలైన వ్యవహారం ఇంకా ముందే వెళ్ళే ప్రమాదం ఉందని, కాబట్టి తాము సస్పెన్షన్ లో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలని విపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది.
కేసీఆర్ సూచించినట్టు… ముఖ్యంగా సభాపతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, అక్కడ తేడా వస్తే… ప్రజల్లోకి నెగెటివ్ సంకేతాలు వెళతాయని భావిస్తున్నారట బీఆర్‌ఎస్ సభ్యులు. స్పీకర్‌తో హావభావాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సభలో ప్రభుత్వాన్ని విమర్శించే టైంలో ఎవర్నీ వ్యక్తిగతంగా దూషించే వరకు వెళ్లకూడదని.. విమర్శలు హుందాగా ఉండాలని అనుకుంటున్నట్టు తెలిసింది. సబ్జెక్ట్ పరంగా సభలో అధికార పక్షాన్ని గట్టిగా కొట్లాడుతూనే… మాటల విషయంలో మాత్రం నిగ్రహంగా ఉండాలన్న ఆదేశాలు వచ్చాయట. జగదీష్ రెడ్డిపై ప్రస్తుతం సస్పెన్షన్ మాత్రమే వేశారు. ఆ మాటలను ఎథిక్స్ కమిటీకి పంపిస్తామని సభలో చెప్పారు. కాబట్టి బిఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు మార్చుకోకపోతే ఆ ఎఫెక్ట్ ఆయన మీద పడుతుందని భావిస్తోందట పార్టీ. మంత్రి శ్రీధర్ బాబు కూడా చిట్‌చాట్‌లో అదే విషయంపై స్పందించారు. ఈ విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపిస్తామని …ఈ సమావేశాలు ముగిసేలోపే ఒక నిర్ణయం తీసుకుంటామని శ్రీధర్ బాబు చెప్పినట్లు గా తెలుస్తోంది. దీంతో ఒకవేళ జగదీశ్ రెడ్డి పై అనర్హత వేటు పడితే ఎలా అని ఆలోచిస్తోందట బీఆర్‌ఎస్. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని, సభలో గొడవ చేసే విషయంలో కాస్త తగ్గాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే సమయంలో గొడవ చేయడం కన్నా వాకౌట్ చేయడం మంచిదని భావించిన బిఆర్ఎస్.. శనివారంనాడు సీఎం స్పీచ్ టైంలో వాకౌట్ చేసింది. ఎక్కడ తగ్గాలో చెలుసుకోవడం తాత్కాలికమేనా? బీఆర్‌ఎస్ వైఖరి పూర్తిగా మారుతుందా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.