అక్కడ టీడీపీ బీసీ లీడర్స్ ఫైరైపోతున్నారా? అన్నీ వాళ్ళకేనా….? మన సంగతేంది బాసూ… అంటూ వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారా? ఆ విషయాన్ని అధిష్టానానికి చెప్పలేక, అలాగని కుదురుగా ఉండలేక లోలోపల రగిలిపోతున్నారా?. అధికారంలో ఉన్నాసరే… ఏంటీ ఖర్మ అనుకుంటూ మథనపడుతున్నారా? ఎవరా నాయకులు? ఎందుకు అంతలా ఫీలవుతున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని బెజవాడ ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బీసీ నేతలు లోలోపల రగిలిపోతున్నారట. 2024 ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం ఏడు అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు కూటమి ఖాతాలో పడ్డాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచిన టీడీపీ 2024కు వచ్చేసరికి మిత్ర పక్షాలతో కలిసి మొత్తం స్వీప్ చేసేసింది. ఎన్నికల సమయంలో పొత్తుల కారణంగా అనేక చోట్ల మూడు పార్టీల నేతలు ఇబ్బందులు పడ్డా….వాటన్నిటినీ అధిగమించి పార్టీలకు అతీతంగా కూటమి గెలుపు కోసం కలిసి కట్టుగా పనిచేసి విజయం సాధించినట్టు చెప్పుకుంటారు. అయితే.. రాను రాను జిల్లాకు చెందిన టీడీపీ బీసీ నేతల్లో అసంతృప్తి పెరిగిపోతోందట. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గర పడుతున్నా.
తమకు అధిష్టానం నుంచి సరైన గుర్తింపు దక్కలేదన్నది వాళ్ళ బాధగా తెలుస్తోంది. ఎన్నికల్లో ఎంపీ సీటు సహా…. జనరల్ కోటాలోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఓసీలకే ఇచ్చాయి కూటమి పార్టీలు. మిగతా రిజర్వుడు రెండు సీట్లు ఎస్సీ, ఎస్టీలకు దక్కాయి. కానీ… బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కూటమి పార్టీలు. ముూడు పార్టీల్లోని బీసీ నాయకులు అప్పట్లో గట్టి ప్రయత్నాలే చేసినా… ఉపయోగం లేకుండా పోయింది. అయితే… అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, వివిధ కేలిక్యులేషన్స్, ఈఈక్వేషన్స్‌తో ఇవ్వలేకపోయి ఉండవచ్చంటూ సర్ది చెప్పుకున్నారట. బెజవాడ పశ్చిమ టీడీపీ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ నాగుల్ మీరా, ఎమ్మెస్ బేగ్ తీవ్ర ప్రయత్నాలు చేసినా దక్కలేదు. బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్ బల ప్రదర్శన చేసినా నో యూజ్. జన సేన నుంచి బీసీ నేత పోతిన వెంకట మహేష్ నిరాహార దీక్షలు సైతం చేసినా… టిక్కెట్ బీజేపీ కోటాలో ఓసీకి దక్కింది. చివరికి ఎన్నికల్లో కూటమి గెలవడంతో… సరే… టిక్కెట్ రాకపోతే పోయింది. మనం గెలిచాం కదా… వేరే పదవుల విషయంలోనైనా గుర్తింపు వస్తుందని ఇన్నాళ్ళు ఎదురు చూశారట బీసీ నేతలు. కానీ…10 నెలలు గడిచినా… కీలక పోస్టులు ఏవీ దక్కక పోవటంతో నైరాశ్యంలో ఉన్నారట బీసీ నాయకులు.
పార్టీ గెలిచిన తర్వాత ఖరారు చేసిన ఎమ్మెల్సీ స్థానాలలో తమకు అవకాశం వస్తుందని ఎదురు చూశారట. కానీ… రెండు విడతల్లో కూడా జిల్లాలో ఎవరికి అధిష్టానం నుంచి పిలుపు లేకపోవటంతో నేతలు మనోవేదనకు గురవుతున్నట్టు తెలిసింది. కనీసం నామినేటెడ్ పదవుల్లో నైనా ప్రాధాన్యత ఇస్తారని భావిస్తే అక్కడ కూడా నిరాశే. తాజాగా జిల్లా డీసీసీబీ పోస్ట్‌ని కూడా ఓసీ నేతకు కేటాయిస్తూ ప్రకటన వచ్చింది. దీంతో పుండు మీద కారం పూసినట్టుగా ఫీలవుతున్నారట ఎన్టీఆర్ జిల్లా టీడీపీ బీసీ నాయకులు. పార్టీ అధిష్టానం దగ్గర తమ అసంతృప్తిని వెళ్ళగక్కే పరిస్థితి కూడా లేకపోవడంతో లోలోపల రగిలిపోతున్నట్టు తెలిసింది. అటు అధిష్టానం మాత్రం పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తామని సమయం, సందర్భాన్ని బట్టి అవకాశాలు కల్పిస్తామని చెబుతోందట. మరినేతల అసంతృప్తి మంటలను అధిష్టానం భరోసా మాటలు ఎంతవరకు చల్లారుస్తాయో చూడాలి మరి.