అమెకు వరుసబెట్టి మిస్డ్ కాల్స్ ఇస్తోంది ఎవరు? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తాజా వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? ఆమె తమతో కలిసి వస్తే బాగుంటుందని కాంగ్రెస్ అధిష్టానం అనముకుంటోందా? లేక ఆమే… కాంగ్రెస్‌కు దగ్గర అవుతున్నారా? అసలేం జరుగుతోంది?
కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి నాకు మిస్డ్ కాల్స్ ఎక్కువయ్యాయని వైఎస్ షర్మిల ప్రకటించడం కలకలం రేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరి నుంచి ఆమెకు మిస్డ్‌కాల్స్ వస్తున్నాయి? ఎందుకలా చేస్తున్నారు? ఇప్పుడే ఆ తంతు ఎందుకు మొదలైందన్న చర్చ జరుగుతోంది. కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో హడావిడి చేస్తున్నారు షర్మిల. వైఎస్ కరిష్మా రాజకీయంగా తనకు ఉపయోగపడేలా పావులు కదుపుతున్నారు. అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో తెలియకున్నా… ఆమె మాత్రం తన ప్రయత్నం తాను చేస్తున్నారు. అంత వరకు బాగానే ఉంది గానీ…ఇప్పుడు మిస్డ్ కాల్ మేటర్స్ కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
అసలేం జరిగిందంటే….రెండు నెలల క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ సుప్రీమ్ సోనియా గాంధీని కలిశారట షర్మిల. కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఈ దిశగా పావులు కదిపారట. ఆయన స్వయంగా షర్మిలను వెంట పెట్టుకుని వెళ్లి.. సోనియా గాంధీని కలిసినట్టు సమాచారం. ఆ సమయంలోనే.. వైఎస్సార్ టీపీని… విలీనం చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగినట్టు తెలిసింది. షర్మిల, డీకే శివకుమార్‌ల ఉమ్మడి ఎన్ఆర్ఐ మిత్రుడొకరి చొరవతో ఈ భేటీ జరిగిందనే టాక్ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో డీకే… కర్నాటక కాంగ్రెస్ కోసం చాలా కష్టపడ్డారని, వైఎస్ అంటే ఆయనకు అభిమానం అని తాజాగా కామెంట్ చేశారు షర్మిల. దీంతో చాలామందికి సోనియాతో భేటీ విషయంలో క్లారిటీ వచ్చిందని అంటున్నారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటానికే ఢిల్లీకి వెళ్లారా..? ఆ క్రమంలోనే మిస్డ్ కాల్స్ వస్తున్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సంబంధం లేకుండానే… ఢిల్లీ నేతలు కాల్స్ చేస్తున్నారా..? అనే అనుమానం కూడా మొదలైందట. షర్మిల రాజకీయ వ్యవహారాలపై టి కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. తమను దెబ్బతీయడానికే… ఆమె పార్టీ పెట్టారన్న చర్చలు కూడా జరిగాయి. అలాంటి పరిస్థితిలో ఇక్కడి నేతల నుంచి ఆమెకు మిస్డ్ కాల్స్ వెళ్లే అవకాశం లేదు. అంటే డైరెక్ట్‌గా ఢిల్లీ నుంచి వస్తున్నాయా.. అన్న అనుమానాలు గాంధీభవన్‌లో పెరుగుతున్నాయి. తెలంగాణలో షర్మిల తమకు ఉపయోగపడతారని అధిష్టానం భావిస్తోందా? లేదంటే..వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఖమ్మం జిల్లా నాయకుడు కూడా కలిసి వస్తారనే ఎత్తుగడ ఉందా? అన్న సందేహాలు కూడా తాజాగా వస్తున్నాయట. ఖమ్మం జిల్లాకు చెందిన ఆ నాయకుడు కాంగ్రెస్ అధిష్టానం ముందు పెట్టిన సీట్ల జాబితాలో సికింద్రాబాద్ అసెంబ్లీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సీటు షర్మిల కోసమేనా అన్న అనుమానాలు ఉన్నాయి. అక్కడ క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ కాబట్టి గతంలో జయసుధ లాగా ఇప్పుడు షర్మిల చట్టసభలో అడుగుపెట్టాలనుకుంటున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కానీ.. బయట జరుగుతున్న ప్రచారాన్ని షర్మిల కొట్టి పారేసినట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో తేలాలంటే…మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.