వేసవి ఉక్కపోత కంటే ఎక్కువగా ఆ ఎమ్మెల్యేలు పొలిటికల్ సఫకేషన్ ఫీలవుతున్నారా? దానికైతే ఏసీ వేసుకుంటే సరిపోతుందిగానీ… దీనికేం చేయాలో అర్ధంకావడం లేదని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారా? ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే చిటపటలాడి పోతున్నారా..? ఎందుకా టీడీపీ శాసనసభ్యులు అంత అసహనంగా ఉన్నారు? వాళ్లకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఉమ్మడి విశాఖజిల్లాలో కూటమి రాజకీయం వేడెక్కుతోంది. వ్యవస్ధ, వైఫల్యాలపై ప్రతిపక్షం కంటే ఎక్కువగా అధికార పార్టీ నాయకులు గళమెత్తడం చర్చనీయాంశమవుతోంది. పైగా… అసంత్రుప్తి స్వరం వినిపిస్తున్న వాళ్ళంతా సీనియర్సే కావడంతో.. అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న భావన పార్టీ వర్గాల్లోనే బలపడుతోంది. ఇటీవల మాజీ మంత్రులు బండారు సత్యన్నారాయణ మూర్తి, గంటా శ్రీనివాస్‌తో పాటు సీనియర్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పొలిటికల్ సఫకేషన్ ఫీలవుతున్నారన్న ప్రచారం విస్తృతమవుతోంది. మరికొందరు అసహనాన్ని ప్రదర్శించేందుకు సమయం, సందర్భం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో కూటమి ఎమ్మెల్యేలలో ఎందుకీ అంతర్మథనం అన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. టీడీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన సీనియర్లు ఇప్పుడు బహిరంగ విమర్శలు చేయడంపై పార్టీ వర్గాల్లో సైతం ఆసక్తి పెరుగుతోందట.లోటు పాట్లు, సమస్యలు ఉంటే వాటిని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళవచ్చుగానీ…అందుకు భిన్నంగా వీళ్ళు నోటికెందుకు పని చెబుతున్నారన్నది బిగ్ క్వశ్చన్. విశాఖ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు కొన్ని రద్దవడంపై వ్యంగ్యంగా స్పందించారు గంటా. ఆంధ్రా టూ ఆంధ్రా వయా తెలంగాణ అంటూ ఆయన ఎక్స్ మెసేజ్ పెట్టడం కలకలం రేపింది. విశాఖ నుంచి విజయవాడకు హైదరాబాద్ మీదుగా వెళ్ళాల్సి వస్తోందన్నది ఆయన బాధ అయినా….చెప్పిన విధానంపై మాత్రం టీడీపీ పెద్దలు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. సంబంధిత శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు టీడీపీ నాయకుడే కావడం, ఆయన శాఖకు సంబంధించిన ఇబ్బందిని నేరుగా ప్రస్తావిస్తే పోయేదానికి గంటా శ్రీనివాస్ ఇలా హైలైట్ చేయడం కరెక్ట్ కాదన్నది టీడీపీ పెద్దల అభిప్రాయం అట. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గానికే పరిమితమైన గంటా…. ఇప్పుడు వాయిస్ రైజ్ చేయడం వెనక కారణాలు ఏంటని ఆరాలు మొదలయ్యాయి. ఇక మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి రాష్ట్ర మంత్రుల తీరుపై ఫైర్ అయ్యారు.. ఈ నెల 30న జరగబోతున్న సింహాద్రి అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు వెళ్ళలేదు. దీంతో బహిరంగంగంగానే వాయిస్ రెయిజ్ చేశారు బండారు. మేమేమన్నా అంటరాని వాళ్ళమా…? లేక మాకు సంబంధం లేదని మంత్రులు భావిస్తున్నారా…? అంటూ కడిగిపాడేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన అనుభవం వున్ననాకు.. కనీసం ఆహ్వానం కూడా లేకపోవడం ఏంటన్నది ఆయన క్వశ్చన్. ఇక పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా సఫగేషన్లో వున్నారట. ప్రోటోకాల్ విషయాల్లో టీడీపీ నేతల వల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పినా… పట్టించుకోవడం లేదనే అసంత్రుప్తి పెరుగుతోందట ఆయనలో. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తనకు కనీస గౌరవ మర్యాదలు దక్కలేదన్నది ఆయన ఆవేదన. పేరుకే ఎమ్మెల్యేలం తప్ప నియోజకవర్గాల్లో మా మాట చెల్లుబాటవడంలేదన్న బాధ కొందరు సిట్టింగ్స్‌లో ఉందట.నియోజకవర్గంలో పనులు జరగాలంటే పైనుంచి ఆదేశాలు రావాలనే స్ధాయిలో వుంటే అధికారులు తమనెందుకు లెక్క చేస్తారని ఎమ్మెల్యేలు ఆవేదన పడుతున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ మేయర్ అవిశ్వాసం కూటమికి పెద్ద చాలెంజ్ అయింది. ఆఖరి నిముషంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అవంతి, నాగిరెడ్డి వారసుల ఓట్లు కలిసి రావడంతో బ్రతుకు జీవుడా అని బయటపడిందిగానీ… లేదంటే మొదటికే మోసం వచ్చేదని చెప్పుకుంటున్నారు. ఆ ఎపిసోడ్‌లో కొందరు ఎమ్మెల్యేలు అసలు పట్టించుకోకపోవడం, పార్టీ ఆదేశించినప్పటికీ అంటీముట్టనట్టు వ్యవహరించడం చర్చనీయాంశమైంది. అవిశ్వాస తీర్మానాన్ని గెలిచాం కాబట్టి సరిపోయిందిగానీ… తేడా వస్తే తలెత్తుకోలేకపోయేవాళ్ళం అన్నది టీడీపీ సీనియర్స్ ఆందోళన. వీళ్ళ ఆవేదన, ఆందోళకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి జిల్లా టీడీపీలో. ఈసారి కూటమి అధికారంలోకి వచ్చాక కొత్త పవర్ సెంటర్స్ తయారై.. హై ఓల్టేజ్ రాజకీయాలు చేస్తున్నాయన్న అభిప్రాయం బలంగా ఉందట. ప్రస్తుతం విశాఖ పాలిటిక్స్ ఎంపీ శ్రీభరత్ చుట్టూ తిరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. అటు, అనకాపల్లిలోనూ ఎంపీ సీఎం రమేష్ యాక్టివ్‌గా వున్నారు. కేవలం ఢిల్లీ స్ధాయిలోనే తమ పని అనే భావనలో కాకుండా స్థానికంగా కూడా వారు దృష్టి పెట్టడాన్ని ఎమ్మెల్యేలు ఇబ్బందిగా ఫీలవుతున్నారట. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పర్యటనలు, తమకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం లాంటి ఆలోచనల్లో ఎంపీలు ఉండటంతో ఎమ్మెల్యేలు పొలిటికల్‌గా ఊపిరాడనట్టు ఫీలవుతున్నారట. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఇది కొత్త పరిణామం అంటున్నారు పరిశీలకులు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఇంకెంతమంది గళం విప్పుతారో చూడాలి.