తెలంగాణలో కమలం పార్టీ కాస్త డిఫరెంట్‌గా ఆలోచిస్తోందా? ఈసారి ఎమ్మెల్సీ సీట్ల విషయంలో ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటోందా? ఎన్నికలు జరగాల్సిన మూడు సీట్లలో ప్రాధాన్యాల మూడ్ మారిపోయిందా? బాగా డబ్బు సంచులున్న వారికోసం కాషాయ దళం వెదుకుతోందన్నది నిజమేనా? అసలేంటీ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం? ఆ విషయంలో అధిష్టానం ఆలోచన ఎలా ఉంది? తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే మార్చి 29తో ఖాళీ అవుతున్నాయి. ఇందులో రెండు టీచర్ సీట్లు కాగా… ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం. కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్,మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలు రెండూ ఖాళీ అవుతున్నాయి. అదే సమయంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికీ ఎన్నిక జరగాల్సి ఉంది. అందుకోసమే ప్రస్తుతం అన్ని చోట్ల ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఆయా వర్గాల్లో తమకు పట్టుందని, ఈ సీట్లలో ఎలాగైనా పాగా వేయాలన్న ప్లాన్‌తో… ఆల్రెడీ కార్యాచరణ మొదలుపెట్టిందట తెలంగాణ బీజేపీ. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీని వేసింది. అయితే పార్టీ టిక్కెట్ విషయంలో ఒక చోట అతివృష్టి, మరోచోట అనావృష్టి ఉందంటున్నారు నాయకులు. ఖమ్మం నల్లగొండ, వరంగల్ టీచర్ స్థానం కోసం ఎక్కువ పోటీ లేదట బీజేపీలో. ఇక్కడ పార్టీ బలంగా లేకపోవడమే కారణం అంటున్నారు.
ఇక్కడ నుండి గతంలో PRTU రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తి టికెట్ అడుగుతుండగా… సంఘ్ పరివార క్షేత్రం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ర్ట అధ్యక్షుడుగా పని చేసిన మరో నాయకుడు కూడా నాకో ఛాన్స్ అంటున్నట్టు తెలిసింది. కానీ.. పార్టీ మాత్రం పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా అని వెదుకుతున్నట్టు సమాచారం. ఇక కరీం నగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానం కోసం పార్టీ నేతలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారట… పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ టికెట్ అడుగుతున్నట్టు తెలిసింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి, రెబెల్ గా పోటీ చేసిన మరో క్యాండిడేట్ కూడా టికెట్ ఆశిస్తున్నట్టు చెబుతున్నాయి బీజేపీ వర్గాలు. మరో మాజీ ఎమ్మెల్యే కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట… అటు ఉమ్మడి అదిలాబాద్ లోని ఒక జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఎంత ఖర్చయినా ఫర్లేదు అంటూ సదరు లీడర్ ఓపెన్ ఆఫర్ పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి మెదక్ కి చెందిన ఒక మహిళా నేత భర్త కూడా టికెట్ అడుగుతున్నారట.
ఇక ఇదే నియోజకవర్గం టీచర్ స్థానానికి కూడా గట్టి పోటీనే ఉన్నట్టు తెలుస్తోంది. గత టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి టికెట్ కోసం ప్రయత్నం చేసుకుంటున్నారట. అలాగే… ప్రముఖ విద్యా సంస్థల అధినేత, గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి కూడా టికెట్ అడుగుతున్నట్టు సమాచారం. పార్టీ కూడా అయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. టీచర్స్ యూనియన్‌లో పనిచేసిన ఒకరిద్దరు కూడా మాకో ఛాన్స్ అంటూ పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. ఇలా మూడు సీట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నా… బీజేపీ అధిష్టానం మాత్రం…డబ్బు, పలుకుబడి కలిసి ఉన్నవాళ్ళ వైపే మొగ్గుతోందన్నది పార్టీ వర్గాల సమాచారం. అదే నిజమైతే… ఏళ్ళ తరబడి పార్టీని అంటిపెట్టుకుని వేలాడుతున్న వారి సంగతేంటన్నది బిగ్ క్వశ్చన్.