తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది పాస్? ఎందరు ఫెయిల్? ఏడాది పాలనలో ఎవరెవరి తీరు ఎలా ఉంది? మేటర్ తేల్చడానికి పార్టీ అధిష్టానం ఏం చేస్తోంది? ఆల్రెడీ ఎవరేంటో తేల్చే పని మొదలైందా? రిపోర్ట్‌ని బట్టి ఈసారి యాక్షన్ మామూలుగా ఉండదా? ఎమ్మెల్యేల ప్రోగ్సెస్ కార్డ్‌పై టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైంది. గతంలో కనీవినీ ఎరుగని మెజార్టీతో మూడు పార్టీలు కలిసి అధికారం చేపట్టాయి. ఆ బలం ఇచ్చిన కిక్కుతోనే… కొందరు ఎమ్మెల్యేలు చాలా ఎక్కువ చేస్తున్నారన్న ఆరోపణలతో ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద దృష్టి పెట్టాయట అధిష్టానాలు. మరీ ముఖ్యంగా… కూటమికి పెద్దన్న పాత్రలో ఉన్న టీడీపీ ఈ విషయంలో ఇంకాస్త సీరియస్‌గానే ఉన్నట్టు సమాచారం. ఆ పార్టీ శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. దీంతో ఈ ఏడాది కాలంలో… ప్రజలకు దగ్గరగా ఉన్నదెవరు? ల్యాండ్, శాండ్, మైన్, వైన్… ఇలా దందాల్లో మునిగితేలుతున్నదెవరన్న విషయంలో ప్రత్యేకంగా సర్వే చేయిస్తోందట టీడీపీ అధిష్టానం. ఇప్పటిదాకా రకరకాల సర్వేలు జరిగినా… ఈసారి అత్యంత పకడ్బందీగా… పది ప్రశ్నలతో ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఎమ్మెల్యేల పనితీరు మీద ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య కాలంలో కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేల మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. కోస్తా, రాయలసీమ అన్న తేడా లేకుండా…. అన్ని చోట్ల అలాగే ఉందని, ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొంతమంది చాలా హైపర్‌గా ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదికలు రావడంతో… ఇప్పుడు డీటెయిల్డ్ సర్వే చేయిస్తున్నారట.
పవర్‌లోకి వచ్చిన రెండు మూడు నెలల్లోనే చాలామంది ఎమ్మెల్యేలు పక్కదారి పట్టినట్టుగా పెద్దల దగ్గర ఆధారాలు ఉన్నాయట. వీటిని దృష్టిలో పెట్టుకునే గతంలో సీఎం చంద్రబాబు చాలా మంది ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. పనితీరు మార్చుకోమని మంత్రులు, ఎమ్మెల్యేలకు చాలా సార్లు చెప్పారు సీఎం. అయినా…. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించకపోవడంతో… ప్రస్తుతం సమగ్ర సర్వే జరుగుతున్నట్టు తెలిసింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఈసారి హెచ్చరికలతో సరిపెట్టకుండా… నిర్మొహమాటంగా కొన్ని చర్యలు, కీలక నిర్ణయాలు ఉంటాయని అంటున్నాయి టీడీపీ వర్గాలు. జిల్లాల పర్యటనకి వెళ్ళినప్పుడు కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు. అదే సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరు కూడా చర్చకి వస్తోంది. అలా తెలిసిన విషయాలను, సర్వే నివేదకలను పోల్చి చూసుకుని చర్యలకు సిద్ధమవుతారన్న చర్చ జరుగుతోంది పార్టీలో. కొంతమంది ఎమ్మెల్యేల అవినీతి తారా స్థాయికి చేరిందని, కొందరు నియోజకవర్గాల్లో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని చెప్పుకుంటున్నారు. దీంతో… అసలు వ్యవహారం ఎలా ఉంది? వాళ్ళవల్ల పార్టీకి, ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందులేంటి? చెబితే మార్చుకునే మూడ్‌లో ఉన్నారా? లాంటి అనేక అంశాల మీద దృష్టిపెట్టి వివరాలు రాబడుతున్నట్టు సమాచారం. దాన్నిబట్టే ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే…. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో కొంతమంది ఎమ్మెల్యేలను వన్ టువన్, మరి కొందర్ని జిల్లాల వారీగా కూడా పిలిచి చంద్రబాబు మాట్లాడవచ్చంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా చాలా చోట్ల ఎమ్మెల్యేల తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కొన్నిచోట్ల వాళ్ళ తీరును బట్టే ఫలితాలు తారుమారయ్యాయన్న అభిప్రాయం ఉంది. అలాంటి పరిస్థితి తమకు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలని అనుకుంటున్నారట సీఎం. చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు పరిధి దాటి ప్రవర్తిస్తున్నట్టు ఇప్పటికే సమాచారం ఉందట. కొన్ని చోట్ల టీడీపీ, జనసేన మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని… వచ్చిన నివేదిక ఆధారంగా కొందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఓవరాల్ గా ఏడాది పాలన తర్వాత ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వీళ్ళని ఇలాగే వదిలేస్తే… నాలుగేళ్ళ తర్వాత ముంచుతారా? తేలుస్తారా? లాంటి రకరకాల కోణాల్లో విశ్లేషించి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారట సీఎం చంద్రబాబు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే కొలిక్కి వస్తే… ఎమ్మెల్యేలు ఎవరు పాస్? ఎవరు ఫెయిల్ అన్నది తేలిపోతుందని అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ని బట్టే ట్యూషన్స్, ఎక్స్‌ట్రా క్లాస్‌లు ఎవరెవరికి అవసరమే తేల్చి ఆ మేరకు యాక్షన్స్ ఉంటాయన్నది పార్టీ ఇంటర్నల్ టాక్.