కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు….. ఇక కుమ్మేద్దామనుకున్నారు. ఆమెలో లీడర్‌షిప్ క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయి…. ఇక అంతా మంచే జరుగుతుందని అనుకున్నారు. కానీ… ఆ ఇన్ఛార్జ్ దూకుడంతా ఆరంభ శూరత్వమేనా? ఇటు తెలంగాణ కాంగ్రెస్, అటు ప్రభుత్వం పెద్ద సవాళ్ళనే ఎదుర్కొంటున్నా ఇన్ఛార్జ్ ఎందుకు స్పందించడం లేదు? చివరికి అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టి కూడా ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నారు? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్‌లు మారుతున్నారు. పాతవాళ్ళు పోతున్నారు, కొత్తవాళ్ళు వస్తున్నారు. కానీ… పార్టీ తీరు మారడం లేదు, క్షేత్ర స్థాయిలో ఆశలు, ఆకాంక్షలు నెరవేరడం లేదన్న చర్చ మొదలైంది. గతంలో ఉన్న, మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చాక మాత్రం గట్టి చర్చే జరిగింది. ఆమె సింప్లిసిటీ, కింది స్థాయిదాకా పరిశీలించగలిగే తత్వం, గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం లాంటి అన్నిటినీ బేరీజు వేసుకుని భారీగానే ఆశలు పెట్టుకున్నారట కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు. అందుకు తగ్గట్టే ఆమె కూడా…. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామని ప్రకటనలు చేశారు. పార్టీని… నాయకత్వాన్ని సమన్వయ పరిచే పనిలో ఉంటానని ప్రకటించారు. కానీ… ఆమె కూడా మాటలకే పరిమితం అవుతారా? లేక చెప్పినట్టు చేతల్లో చూపిస్తారా అన్న అనుమానాలు కొత్తగా మొదలవుతున్నాయట కేడర్‌లో. చాలా రోజులుగా తెలంగాణలో జరుగుతున్న వ్యవహారాలపై రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్‌గా మీనాక్షి నటరాజన్ ఏమాత్రం స్పందించడం లేదు. వచ్చిన కొత్తలో అన్ని అంశాలపై వేగంగా స్పందించిన మీనాక్షి ఇప్పుడు మాత్రం అంటీ ముట్టనట్టుగా ఉన్నారన్న చర్చ గాంధీభవన్ సర్కిల్స్‌లో జరుగుతోందంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా.. ఇంతవరకు పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసుకోలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నానాపాట్లు పడ్డవాళ్లంతా…పదవుల కోసం ఎదురు చూడక తప్పడం లేదు.
దీనికి తోడు పీసీసీ అధ్యక్షుడి నియామకం జరిగి ఆరు నెలలు గడిచినా… ఇంతవరకు పూర్తి స్థాయిలో కమిటీ కూడా వేసుకోలేని దుస్థితి. ప్రభుత్వంలో పదవులు వస్తాయో, రావో తెలియక, కనీసం పార్టీలోనన్నా పోస్ట్‌లు దక్కుతాయన్న ఆశతో ఉన్నవాళ్ళకి కూడా నిరాశ తప్పడం లేదన్నది కాంగ్రెస్ ఇంటర్నల్ టాక్. ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్నాక అనేక అంశాలపై చర్చలు జరిగాయి. కానీ… ఇప్పటికీ ఒక్కటి కూడా కొలిక్కి రాలేదు. పార్టీ కోసం పని చేసిన నాయకులకు.. ఎమ్మెల్యేలకు..మంత్రులకు మధ్య సమన్వయ లోపం ఉందని చెప్పారు తప్ప…దాన్ని సరిదిద్దే ప్రయత్నం ఏ మాత్రం జరగడం లేదన్నది పార్టీ వర్గాల టాక్. క్షేత్ర స్థాయిలో ఉన్న నాయకులను పదవులతో సంతృప్తి పరచకపోతే ప్రభుత్వం ఎంత మంచి పథకం ప్రవేశపెట్టినా జనంలోకి వెళ్ళదు. అసలు దాని గురించిన చర్చే ప్రజల్లో జరిగే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇదే సమస్యను ఎదుర్కొంటోందట. పార్టీ అధినాయకత్వం కూడా ఈ సమస్యను గుర్తించిందిగానీ… పరిష్కారాన్ని మాత్రం చూపడం లేదన్నది తెలంగాణ కాంగ్రెస్‌లో ఓపెన్ టాక్. ప్రభుత్వం ఇటీవల తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఖచ్చితంగా పేద ప్రజలకి మంచి పథకమన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. కానీ… అంత మంచి స్కీమ్ గురించి గ్రామ స్థాయిలో ప్రచారం చేసుకునే, కనీసం చెప్పుకునే పరిస్థితి లేదు. పార్టీ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు కనిపించట్లేదు. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఆ బియ్యంలో నూకలున్నాయని, నాణ్యత లేదని దుష్ప్రచారాలు మొదలు పెట్టేశారట. ఇక ఇటీవల hcu భూముల వ్యవహారంలో పెద్ద రచ్చే జరిగింది. దీనిపై అధిష్టానం స్పందించే వరకు కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాట్లాడలేదు. డైరెక్ట్‌గా ఆమె రంగంలోకి దిగి వ్యవహారాన్ని సెట్ చేయాల్సింది పోయి… అధిష్టానం ఆదేశించాక మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలకు, సమన్వయ లోపాలకు మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో ట్రీట్మెంట్ ఇస్తారని మొదట్లో అంతా భావించారు. కానీ… మేడం ఇంకా పని మొదలుపెట్టినట్టు కనిపించడం లేదన్నది గాంధీభవన్‌లో జరుగుతున్న చర్చ. ఇకనన్నా ఇన్ఛార్జ్ ఫోకస్ పెడతారో లేదో చూడాలంటున్నారు పార్టీ నాయకులు.