సినీనటి జెత్వానీ కేసులో కొత్త కొత్త ట్విస్ట్‌లు ఉంటాయా? ఇంకొందరు ఐపీఎస్ ఆఫీసర్స్ మెడకు చుట్టుకోబోతోందా? ఈ ఎపిసోడ్‌లో మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి పేరు ఎందుకు వస్తోంది? ఇప్పటికే సస్పెండ్ అయిన ముగ్గురు ఐపీఎస్‌లు మరికొన్ని కేసుల్లో కూడా ఇరుక్కోబోతున్నారన్నది నిజమేనా? అసలు జెత్వానీ కేసు కేంద్రంగా జరగబోతున్న కొత్త పరిణామాలు ఏంటి? సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో ఏపీకి చెందిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ సస్పెండ్ అయ్యారు. అది కూడా ఆమెను కేసులతో వేధించారనే అభియోగాలపై కావడం సంచలనమైంది. గతంలో కూడా వివిధ స్థాయిల్లోని ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయినా.. ఈ కేసు వాటికి పూర్తి భిన్నమైనదన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. అన్నిటికీ మించి…. సస్పెండైన ముగ్గురిలో ఒకరిది డీజీ స్థాయి అయితే.. మరొకరు ఐజీ, ఇంకొకరు ఎస్పీ స్థాయి అధికారి. దీంతో పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నిల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతకు మించిన రచ్చ కూడా అయింది. ముగ్గురు అధికారుల మీద నమోదైన కేసుల దర్యాప్తు ఒక ఎత్తయితే… ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లోకి మరో కొత్త కేరక్టర్ ఎంటరైందని అంటున్నారు. సీనియర్ ఐపీఎస్‌ల మీద దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి పేరు కూడా తెర పైకి రావడం సంచలనం అవుతోంది. జెత్వానీ కేసులో నేరుగా నాటి డీజీపీ పేరు లేకున్నా.. పరోక్షంగా… ఆయన వ్యవహారశైలిపై చర్చ జరుగుతోందట అధికార వర్గాల్లో. నాటి డీజీపీగా, స్టేట్ పోలీస్ బాస్‌గా ఈ కేసు విషయంలో ఏం జరుగుతోందో తెలిసి కూడా…. ఆపలేదని, నిబంధనలకు అనుగుణంగా వెళ్లాలని తన కింది అధికారులకు చెప్పలేకపోయారని, దీన్ని ఎలా చూడాలంటూ కసిరెడ్డి విషయంలో చర్చ జరుగుతోందట.ఇదే సందర్భంలో మరో మాట సైతం వినిపిస్తోందని అంటున్నారు.
జెత్వానీ మీద కేసు పెట్టడం, కుక్కల విద్యాసాగర్‌ను తెర మీదకు తీసుకురావడం లాంటి వ్యవహారాలతో సహా… ఇంకా తెర మీదకు రాని విషయాలు చాలానే ఉన్నాయని, అవన్నీ నాటి డీజీపీగా కసిరెడ్డికి తెలిసే జరిగాయనేది ఆ వాదన. ప్రస్తుతం జెత్వానీ పెట్టిన కేసుల మీద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా మాజీ డీజీపీ పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో అవసరమైతే ఆయన్ని కూడా విచారిస్తారా..? దర్యాప్తుకు సహకరించాలని నోటీసులు ఇస్తారా..? అన్నది తాజాగా హాట్ టాపిక్ అయింది ఏపీ పోలీస్ వర్గాల్లో. ఇదే సందర్భంలో మరో కీలకమైన అంశం కూడా బయటికి వస్తోంది. సస్పెండైన ఐపీఎస్ అధికారులు పీఎస్సార్, కాంతి రాణా, గున్నిలపై గతంలో ఏమైనా అభియోగాలు ఉన్నాయా..? అనే కోణంలో కూడా ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అందరికంటే ఎక్కువగా పీఎస్సార్ ఆంజనేయులు మెడకు ఏపీపీఎస్సీలో జరిగిన వ్యవహారాలు చుట్టుకోబోతున్నట్టు సమాచారం. గ్రూప్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు.. వాల్యూయేషన్లో రకరకాల పద్దతులను అవలంభించారనే అభియోగాలు తెర మీదకు వస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం సేకరించడంతో పాటు.. అవసరమైన సాక్ష్యాలను కూడా సిద్దం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి రాష్ట్ర పోలీస్ వర్గాలు. ఇదే జరిగితే…. పీఎస్సార్ మరిన్ని కేసుల్లో ఇరుక్కోవడం ఖాయమని అంటున్నారు. ఏపీపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు దాని మీద ఫోకస్ పెట్టి.. కొత్తగా కేసు నమోదు చేయించే దిశగా కసరత్తు జరుగుతోన్నట్టు సమాచారం. ఈ విధంగా మిగిలిన వారి మీద కూడా ఏమైనా కేసులు ఉన్నాయా..? అనే అంశంపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో జగన్ గులకరాయి ఎపిసోడ్‌లో నాడు పోలీస్ కమిషనర్‌గా ఉన్న కాంతి రాణా తాతా మీద విమర్శలు వచ్చాయి. అన్యాయంగా అమాయక యువకులను నిందితులుగా చూపుతున్నారని, జైళ్లకు పంపుతున్నారంటూ నాడు టీడీపీ నేతలే అన్నారు. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన వ్యవహారాలను సైతం తిరగదోడి కాంతి రాణా పాత్ర మీద దర్యాప్తు చేసే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా… ఇలా జెత్వానీ కేసు కొత్త పుంతలు తొక్కబోతోందన్నది ఏపీ పోలీస్, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ముందు ముందు ఇంకెన్ని ట్విస్ట్‌లు ఉంటాయో, ఏయే మలుపులు తిరుగుతాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.