జమ్మలమడుగులో కొత్త జాతర మొదలైంది! అదేనండీ.. పొలిటికల్ జాతర! ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క..! అన్నొచ్చాడని చెప్పండని ఆయన తొడగొడుతున్నాడు! ఇన్నాళ్లున్న సైలెంటుగా ఉండి ఇప్పుడొక్కసారిగా జై జమ్మలమడుగు అన్నాడు. మరి ఇంతకాలం చక్రం తిప్పిన ఇంకో లీడర్ ఎక్కడ? ఆయన ఎటు వెళ్లారు? రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. గెలస్తారు.. ఓడుతారు! ఫీల్డులో ఉండాలి.. ఫైట్ చేయాలి! ఎవరైనా ఇదే సూత్రంతో రాజకీయాలు నడుపుతుంటారు. కానీ జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డికి అంత ఓపికలేదట. 2019లో భారీ మెజారిటీతో గెలిచారు. 2024లో ఓడిపోయారు. అప్పటి నుంచి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారట. అజ్ఞాతంలో ఉన్నారని సొంతపార్టీలోనే చర్చించుకుంటున్నారు. స్వతహాగా సుధీన్‌రెడ్డి డాక్టర్. ఖద్దరు వదిలేసి తెల్లకోటు వేసి ప్రాక్టీస్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో కీలకంగా మరో నేత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి యాక్టివేట్ అయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గ బాధ్యతలు ఆయనే చూస్తున్నారు. అదే ఊపులో జమ్మలమడుగులో మరో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ వైసీపీ పార్టీ కార్యాలయం ఉండగా, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కొత్తగా వేరే ఆఫీస్ ప్రారంభించారు. పార్టీ అధినేత జగన్ ఆయనకు ఏం భరోసా ఇచ్చారో తెలియదు కానీ, ఆ ఎమ్మెల్సీ మాత్రం కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారట. అధికారపక్షం దాడులు ఆపకపోతే ప్రతిదాడులు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారట. ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క.. అన్నొచ్చాడని చెప్పండంటూ తొడగొడుతున్నాడట!
జమ్మలమడుగు ఉమ్మడి కడప జిల్లాలో ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్. జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోను జమ్మలమడుగు స్టయిలే వేరు. ఇక్కడ ఎన్నికల ముందు.. ఎన్నికల తర్వాత కూడా అదే రాజకీయ వేడి రగులుతూ ఉంటుంది. గెలిచినా ఓడినా… నాయకుడు అక్కడి జనంతో టచ్‌లో ఉంటూ పాలిటిక్స్ నడుపుతుంటారు. కానీ మూలె సుధీర్ రెడ్డి డిటాచ్ కావడంతో కార్యకర్తలు అయెమయంలో పడ్డారు. ఎందుకిలా అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి.. అధికారం పోయినప్పుడు కార్యకర్తలకు దూరంగా ఉండటంతో తలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థిగా ఉన్న రామసుబ్బారెడ్డిపై పోటీ చేసి గెలిచారు సుధీర్ రెడ్డి. ఇప్పుడు అదే రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు వైసీపీకి పెద్దదిక్కుగా మారారు. 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం నుంచి నుంచి ఫ్యాన్ పార్టీలో చేరిన రామసుబ్బారెడ్డికి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చారు. ఇప్పటికే వైసీపీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు చూస్తున్న రామసుబ్బారెడ్డి.. త్వరలో జమ్మలమడుగు బాధ్యతలు కూడా చూస్తారని సమాచారం. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం రాజకీయాలకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో డాక్టర్‌గా సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారట. జమ్మలమడుగులో జగన్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే.. పొన్నపురెడ్డి కుటుంబమే సరైందని.. కరెక్ట్ పర్సన్‌కే బాధ్యతలు ఇచ్చాననే భావనలో జగన్ ఉన్నారని పార్టీ వర్గాలంటున్నాయి. మరి జమ్మలమడుగు రాజకీయాన్ని రామసుబ్బారెడ్డి ఎటు తీసుకెళ్తారో చూడాలి!