ఆ వైసీపీ ఎమ్మెల్యేకి అరెస్ట్ భయం పట్టుకుందా? ఎప్పుడు లోపలేస్తారో తెలియదని కంగారు పడుతున్నారా? అందుకే నియోజకవర్గంలో తిరగడం కూడా మానేశారా? తనతో పాటు తన అన్న, ఆయన కొడుకు కూడా కనీసం ఆరు నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందని ఓపెన్గానే చెప్పేస్తున్నారా? మరి మిమ్మల్ని నమ్ముకుని చెలరేగిన మా సంగతేంటని కేడర్ అడిగితే సమాధానం లేదా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన జైలు భయం? తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై ఇప్పుడు నియోజవర్గంలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. 2019, 2024 ఎన్నికల్లో వరుసగా వైసీపీ తరపున గెలిచారాయన. 24 ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ రెండు నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. అందులో ఒకటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు కాగా….రెండోది ఆయన తమ్ముడు ద్వారకానాథ్‌రెడ్డి గెలిచిన తంబళ్ళపల్లి. అయితే… తొమ్మిది నెలలు గడుస్తున్నా నియోజవర్గంలో అస్సలు తిరగడం లేదట ఎమ్మెల్యే. వైసీపీ ప్రభుత్వ హయంలోనూ నా మాటే శాసనం అన్న రీతిలో ఐదేళ్లపాటు రచ్చ రచ్చ చేసిన ద్వారకానాథ్ రెడ్డి… ఇప్పుడు మాత్రం నాకేం సంబంధం లేదన్నట్టు కనిపించకుండా పోవడం ఏంటని అడుగుతున్నారు నియోజకవర్గ ప్రజలు. అప్పట్లో… చంద్రబాబు పర్యటన సమయంలో జరిగిన గొడవలు, అంగళ్లు అల్లర్లు, లోకేష్ పాదయాత్ర సమయంలో గొడవ…. ఇలా ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వచ్చిన ద్వారకనాథరెడ్డి ఇప్పుడు మాత్రం ఆయనేనా ఈయన అన్నట్టుగా ఉంటున్నారట. గొడవలు, దూకుడు సంగతి పక్కనబెడితే…. కనీసం ఓట్లేసిన ప్రజలకు సైతం అందుబాటులో లేకపోవడంతో చిన్న చిన్న పనులు కూడా అవక ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా… పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నియోజకవర్గానికి వెళ్ళడానికి మొహమాటపడుతూ… చూద్దాంలే, చేద్దాంలే అన్నట్టుగానే ఉన్నారట…. దీంతో సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. నియోజవర్గంలో తక్కువ, తిరుపతిలో ఎక్కువ అన్నట్టు ఉందట ద్వారకానాథరెడ్డి వ్యవహారం. కనీసం మమ్మల్ని కూడా పట్టించుకోకుండా పోతే ఎలాగంటూ వైసీపీ కేడర్ లోలోపల రగిలిపోతున్నా…. పెద్దిరెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా బయటికి మాట్లాడితే…. ఏమవుతుందోనన్న భయంతో కామ్‌గా ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే విషయంలో కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మొన్నటి దాకా కేసుల భయంతోనే ఆయన బయటికి రావడంలేదని భావించిన పార్టీ నేతలకు సైతం ఇప్పుడు షాకిచ్చేలా కొన్ని మాటలు చెప్పడంతో విన్న వాళ్ళకు మైండ్ బ్లాక్ అవుతోందట.. అన్నా… మీరు నియోజకవర్గంలోకి రావాలన్నా… ఎవరైనా అడిగితే… ఆయన మాత్రం, మమ్మల్ని ప్రభుత్వం వేధిస్తోందని, ఇవాళ కాకుంటే రేపైనా అరెస్ట్ చేస్తారని, కనీసం ఆరు నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందంటూ లీకులివ్వడంతో అది వింటున్న వైసీపీ నాయకుల నోట మాట రావడం లేదట.
అంటే… గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుందో లేదో తెలియదుగానీ… వీళ్ళు మాత్రం గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయట తంబళ్ళపల్లి వైసీపీలో. సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్నిప్రమాద ఘటనలో తన అన్న పెద్దరెడ్డి, లిక్కర్ స్కాంలో మిధున్ రెడ్డి అరెస్ట్ అవుతారని ద్వారకానాధ్‌రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారట. ఎవరైనా… కాస్త స్వతంత్రించి వాళ్ళు అరెస్ట్ అవడానికి, మీరు నియోజకవర్గంలో తిరగడానికి సంబంధం ఏంటని అడిగితే మాత్రం మౌనమే సమాధానం అట. ఓవైపు పార్టీ కేడర్ అంతా…. మా మీద కేసులు పెడుతున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారని గగ్గోలు పెడుతుంటే… ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి మాత్రం మమ్మల్ని అరెస్టు చేస్తారంటూ భయ భయంగా చెప్పడాన్ని స్థానిక నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారట. మేం ఏమైపోయినా ఫర్లేదు. మీ అరెస్ట్‌ల గురించి మాత్రమే ఆలోచిస్తారా? ఇలాంటి వాళ్ళ కోసమా నాడు ఎగబడి ఎగబడి పని చేసింది అంటూ నియోజకవర్గ నాయకులు ఫైరైపోతున్నట్టు సమాచారం. నాడు చంద్రబాబు వచ్చినప్పుడు మిమ్మల్ని నమ్ముకుని గొడవలకు దిగితే… ఇప్పుడేమో మా పరిస్థితే బాగోలేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారట కార్యకర్తలు. అసలు ఐదేళ్లపాటు మీసం మేలేసి సై అంటే సై అంటూ గొడవలకు దిగింది ఈ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డేనా అంటూ హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారట తంబళ్ళపల్లి వైసీపీ నాయకులు. అటు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి జయచంద్రారెడ్డి మాత్రం వాళ్ళిద్దరే కాదు ద్వారకానాథ్ రెడ్డి చేసిన భూదందాలకు సంబంధించి ఆయన కూడా అరెస్టవక తప్పదని అంటున్నారట. దీంతో అందుకేనా మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో అడుగుపెట్టడం లేదని వైసీపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలా కేసులు, అరెస్టుల భయాలతో మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే రేపు పొద్దున టిడిపి నేతల చేతిలో మా పరిస్థితి ఏంటని గగ్గోలు పెడుతున్నారట తంబళ్లపల్లె వైసిపి కార్యకర్తలు. అయితే ద్వారకనాథ్ రెడ్డి పార్టీ క్యాడర్ దృష్టిలో ఉంచుకొనే ఇలాంటి లీకులు ఇస్తున్నారని, ఒకవేళ అరెస్టులు జరిగినా తట్టుకుని నిలబడేందుకోసం వాళ్లని ముందే ప్రిపేర్ చేస్తున్నారన్నది ఎమ్మెల్యే సన్నిహితుల మాట. పార్టీ లీడర్స్ కేడర్ బాధలు ఎలా ఉన్నా… ఆ మాటల్ని బట్టి చూస్తుంటే…. పెద్దిరెడ్డి కుటుంం అరెస్ట్‌లకు మానసికంగా సిద్ధమై పోయినట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు.