ఆ మాజీ మంత్రి తన ప్రాపకం కోసం సొంత పార్టీ టీడీపీని ఇరుకున పెడుతున్నారా? ఉనికి చాటుకునేందుకు ఆయన చేస్తున్న విన్యాసాలతో కేడర్ కంగారు పడుతోందా? పార్టీకంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని ఆ సీనియర్ అనుకుంటున్నారా? ఏదో ఒకటి కెలికేసి… తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో పార్టీని డ్యామేజ్ చేస్తున్నారా? తెర వెనక రాజకీయాలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్న ఆ మాజీ మంత్రి ఎవరు? ఏంటాయన మంత్రాగం?.. దేవినేని ఉమా… టీడీపీ సీనియర్ లీడర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని 2014-19 మధ్య మంత్రిగా ఉండి ఉమ్మడి కృష్ణాజిల్లాలో చక్రం తిప్పారు. ఇటు పార్టీపై కూడా పూర్తి స్థాయి ఆధిపత్యం చూపించి తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారాయన. కేశినేని నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి నేతలు టీడీపీలో ఉన్నప్పుడు ఉమా తీరుతో ఇబ్బందులు పడ్డారనేది టీడీపీ వర్గాల్లోనే ఉన్న విస్తృత ప్రచారం. ఇక 2019 ఎన్నికల్లో పార్టీతో పాటు ఉమా కూడా ఓడిపోయారు. ఆయన మీద మైలవరం నుంచి వైసీపీ తరపున తొలిసారి పోటీ చేసిన వసంత కృష్ణప్రసాద్ గెలిచారు. ఐదేళ్ళపాటు ఎమ్మెల్యే వసంతపై అనేక ఆరోపణలు చేసిన ఉమాను పక్కనబెట్టి… వసంతనే పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దీని ద్వారా… ఉమాను పూర్తిగా పెట్టామనే సంకేతాలను అధిష్టానం ఇచ్చినట్టు చెప్పుకున్నారు. మంత్రిగా ఐదేళ్ళపాటు అధికారంలో ఉన్నపుడు ఉమా తీరుతోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ బలహీనపడిందన్న ఫీడ్ బ్యాక్ అధిష్టానం దగ్గర ఉండటమే అందుకు కారణం అన్న అభిప్రాయం ఉంది. ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ళు వసంతపై తాను ఆరోపణలు చేసినా… పట్టించుకోకుండా 2024 టిక్కెట్‌ను ఆయనకే ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోయిన ఉమా… చివరికి ఏమీ చేయలేక చంద్రబాబు ఆదేశాలతో ఎన్నికల టైంలో మౌనంగా ఉండిపోయారట. అప్పుడు ఉమాతో కలిసి వెళ్ళేందుకు కృష్ణ ప్రసాద్ రెండు మూడు ప్రయత్నాలు వసంత చేసినా… అడుగులు ముందుకు పడలేదట. ఎన్నికల్లో పార్టీతోపాటు మైలవరంలో కూడా టీడీపీ గెలిచింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో తన వర్గం నేతలతో తెరచాటు రాజకీయం చేస్తున్నారట దేవినేని.
ఇక కొన్నాళ్ళుగా పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లేకపోయినా తాను కొన్నిచోట్లకు వెళ్ళటంతో పార్టీ క్యాడర్ ఇబ్బంది పడినట్టు తెలిసింది. మైలవరంలో గత ఐదేళ్ళుగా రేషన్ మాఫియా కోట్ల రూపాయలతో జేబులు నింపుకుందని, కూటమి ప్రభుత్వం వచ్చినా ఇంకా కొనసాగుతోందని, దీనిపై సమగ్ర విచారణ చేస్తుందంటూ ఇటీవల ట్వీట్ చేశారు ఉమా. గతంలో వసంత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నపుడు కూడా ఇదే విధంగా ఆరోపణలు చేశారని, ఇప్పుడు సైతం ఎమ్మెల్యే టార్గెట్‌గా ఆరోపణలు చేస్తున్నారన్నది వసంత వర్గం వెర్షన్. తనకు దక్కాల్సిన టికెట్‌ను వసంత కృష్ణప్రసాద్ తన్నుకుపోయారన్న అక్కసుతో ఉద్దేశ్యపూర్వకంగానే ఉమా పోస్టులు పెడుతున్నారంటూ వాటిని అధిష్టానానికి పంపారట ఎమ్మెల్యే అనుచరులు. గతంలో, ఇప్పుడు రేషన్ మాఫియా అవినీతి మరకలు వసంతకు అంటించేందుకు ఉమా ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇక మొదటి నుంచి నందిగామ సొంత అడ్డాగా రాజకీయాలు చేసిన ఉమా… ఇటీవల ఆ నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికలో కూడా తెర వెనుక మంత్రాంగం నడిపారనేది పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. నందిగామ నుంచి దేవినేని ఉమా రెండుసార్లు, ఆయన అన్న రమణ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఎస్సీ రిజర్వ్‌డ్ అవడంతో… అక్కడి నుంచి మైలవరం వచ్చి పోటీ చేస్తున్నారు ఉమా. 2014లో తాను టికెట్ ఇప్పించి గెలిపించిన తంగిరాల సౌమ్య ఇప్పుడు నందిగామ ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎంపిక విషయంలో అధిష్టానం తరపున ఎంపీ కేశినేని చిన్ని ఒక పేరును ప్రతిపాదించినా ఎమ్మెల్యే సౌమ్య అంగీకరించకుండా మరోవ్యక్తికి ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో మధ్యేమార్గంగా అధిష్టానం ఆ ఇద్దరినీ కాదని మరొకర్ని ఛైర్ పర్సన్ పదవికి ఎంపిక చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కూడా తెరవెనుక ఉమా మంత్రాంగం ఉందన్నది లోకల్ టాక్. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి కొందరు తీసుకెళ్ళారట. తన ఉనికిని చాటుకునేందుకు ఉమా ఇలా వ్యవహరిస్తున్నారా అనే చర్చ జరుగుతున్నా ఈ వ్యవహారాలతో పార్టీ ఇరుకున పడుతోందనేది తమ్ముళ్ళ ఆవేదనగా తెలుస్తోంది. ఈ చర్యలకు అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.