ఏంటా ధైర్యం? ఎందుకలా మాట్లాడారు? తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టుండి అంత మాట అనేశారేంటి? ఆయన మనసులో ఏముంది? వాళ్ళకు ధైర్యం చెప్పే మాటలా? లేక అంతకు మించిన వ్యూహమా?….. అసలింతకీ ఏమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి? ఆయన మాటల చుట్టూ ఓ రేంజ్‌లో చర్చ ఎందుకు జరుగుతోంది? ఇవే……. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ఈ మాటలే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశం అయ్యాయి. ఇటు సొంత పార్టీ, అటు ప్రతిపక్షాలు ఈ మాటల మీదే స్పెషల్ ఫోకస్ పెట్టి చర్చోప చర్చలు చేసేస్తున్నాయి. అసలు ఏ ధైర్యంతో ఆయన ఆ మాటలు అన్నారు? పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోవని అంత కాన్ఫిడెంట్‌గా సభ సాక్షిగా ఎలా చెప్పగలిగారు? అసలు ఆయన వెనక వ్యూహం ఏంటి..అని మాట్లాడుకుంటున్నారు అన్ని పార్టీల నాయకులు. ఉప ఎన్నికలు రావు… ఎందుకు వస్తాయని ఒక వ్యూహం ప్రకారమే ఆయన సభలో ప్రశ్నించారా అన్న వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడెందుకు వస్తాయంటూ కౌంటర్ ఇచ్చారు సీఎం. ఎవ్వరూ ఆందోళన పడాల్సిన పనిలేదు. ఉప ఎన్నికలు రావని భరోసా ఇచ్చారాయన. దాంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు స్పందించారు. కోర్టులో ఉన్న వ్యవహారంపై సీఎం కామెంట్ చేయడం సరికాదని, సభలో ఆయన అన్న మాటల్ని సుప్రీంకోర్టులో చూపిస్తామని చెప్పారు హరీష్. అయితే అందుకు కూడా క్లారిటీ ఇచ్చేశారు ముఖ్యమంత్రి. తాను కోర్టును ఉద్దేశించి మాట్లాడలేదని,ఉప ఎన్నికలు వస్తాయంటూ ఓ పార్టీ నాయకుడు చేస్తున్న ప్రచారం గురించి మాత్రమే మాట్లాడానని క్లారిటీ ఇచ్చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా… అసలు సీఎం అంత కాన్ఫిడెంట్‌గా ఉప ఎన్నికలు రావని ఎలా చెప్పగలిగారంటూ ఆరాలు తీయడం మొదలైపోయింది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కొందరు కాస్త అసంతృప్తితో ఉన్నారని, తిరిగి సొంత గూటికి వెళ్తారని ఓ ప్రచారం జరుగుతోంది.
దీన్నే అనుకూలంగా మల్చుకుంటున్న ప్రతిపక్షం…ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని, గుణపాఠం చెప్పడం ఖాయమంటూ వాయిస్ పెంచుతోంది. దాని కౌంటర్‌గానే… బైపోల్స్ జరగబోవని సీఎం అన్నట్టుగా విశ్లేషిస్తున్నారు కొందరు. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఆందోళన కలిగించేలా విపక్షం వ్యూహం పన్నిందని, కానీ… అంత సీన్ లేదంటూ… తమ పక్షాన చేరిన వారికి భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే ఆ కామెంట్స్ చేసి ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. దీనికి తోడు… గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విలీనం చేసుకోవడం, పార్టీ ఫిరాయింపులపై అప్పట్లో ఫిర్యాదు చేసిన లెక్కచేయకుండా వ్యవహరించిన బీఆర్‌ఎస్ వైఖరిని ఎండగట్టడం కోసం కూడా అలా మాట్లాడి ఉండవచ్చంటున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అదసలు సమస్యే కాదన్నట్టు వ్యవహరించిన గులాబీ నేతలు ఇప్పుడు మాత్రం అంతకు మించిన సమస్య వేరొకటి లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వైఖరిపై చర్చ పెట్టేందుకే సీఎం అలా మాట్లాడి ఉండవచ్చన్నది ఇంకో వెర్షన్. బీఆర్‌ఎస్ ద్వంద్వ వైఖరిని మరోసారి జనం ముందు పెట్టడం, ఒక్కో పార్టీకి… ఒక్కో న్యాయమా అనే అంశం మీద మాట్లాడుకునేలా చేసే వ్యూహం కూడా ఉందని అంటున్నారు. మొత్తం మీద అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భరోసా ఇవ్వడం, ఇటు ప్రతిపక్షం వైఖరిని ఎండగట్టడం లాంటి బహుళ ప్రయోజన టార్గెట్‌తోనే రేవంత్‌రెడ్డి అలా మాట్లాడి ఉండవచ్చంటూ విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్.