జీవో ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందే ఏపీ సర్కార్ ఎందుకు యూ టర్న్ తీసుకుంది? తుని రైలు దహనం కేసు రీ ఓపెన్ కోసం ఉత్తర్వులు ఇచ్చి వెంటనే ఉపసంహరించుకోవడానికి కారణం ఏంటి? తెర వెనక కథ ఏం జరిగింది? పర్యవసానాలు గరించి ముందే ఆలోచించకుండా జీవో ఇచ్చేశారా? ఏ స్థాయిలో ఫైల్ కదిలి జీవో బయటికి వచ్చింది? ఉత్తర్వులు ఇచ్చిందెవరు? ఆపిందెవరు? కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌తో 2016 జనవరి 31న తునిలో బహిరంగ సభ నిర్వహించారు. ఆ మీటింగ్ తర్వాత రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. తుని టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లను కాల్చేశారు. రైల్వే ఆస్తులు ధ్వంసం చేశారంటూ విజయవాడ రైల్వే కోర్టులో దాదాపు ఏడేళ్ళు విచారణ జరిగింది. విచారణ తర్వాత ఈ కేసులో నాటి కాపు ఉద్యమ నేత ముద్రగడతో పాటు మరో 41 మందికి సంబంధం లేదని కొట్టేసింది కోర్ట్. అయితే.. ఆ తీర్పు మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం హై కోర్ట్‌లో అప్పీల్‌కు వెళ్ళాలని నిర్ణయిచడం సంచలనమైంది. దీనికి సంబంధించిన జీవో కూడా జారీ అవడం ఒక ఎత్తయితే… 24 గంటలు గడవకముందే దాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు రావడం అంతకు మించిన సంచలనమైంది. తుని కేసును తిరగదోడే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. కేసును కొట్టేస్తూ…రైల్వే కోర్ట్ ఇచ్చిన తీర్పును హైకోర్ట్‌లో సవాల్ చేయబోమని కూడా చెప్పేసింది ప్రభుత్వం. హైకోర్ట్‌కు వెళ్ళాలని నిర్ణయించినట్టు వచ్చిన జీవోను తక్షణనే రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకచన వచ్చింది ప్రభుత్వం వైపు నుంచి. అయితే… అసలు చర్చ ఇక్కడే మొదలైంది. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జీవో బయటికి వచ్చిందా? అదే నిజమైతే… అలాంటి జీవోను ఇచ్చిందెవరన్న చర్చ జరుగుతోంది సచివాలయ వర్గాల్లో. ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచిందన్న విషయంపై ఆరా తీస్తోందట సర్కార్. ఆర్పీఎఫ్ సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఆ ఉత్తర్వులు వచ్చినట్టు గుర్తించారట అధికారులు. కాపు రిజర్వేషన్ అన్నది చాలా సున్నితమైన అంశం. ఇలాంటి విషయంలో పార్టీలు, ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరిస్తూ వస్తున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గతంలో కాపు రిజర్వేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా స్పందించిన పరిస్థితి. కానీ… వీటితో సంబంధం లేకుండా…. సున్నితమైన అంశాల్ని పట్టించుకోకుండా… తుని కేసును రీ ఓపెన్ చేయాలనుకోవడంపై కూటమిలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయిట్టు తెలుస్తోంది. ఇలాంటి అంశం మీద మొండిగా, మూర్ఖంగా ముందుకు వెళితే…కాపు సామాజిక వర్గంలో అలజడి రేగే ప్రమాదం ఉందని గుర్తించారు కూటమి పెద్దలు. ఆ క్రమంలోనే… ముందు ఇచ్చిన జీవోను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అప్పీల్‌కు వెళితే… దాని మీద కచ్చితంగా వివిధ వర్గాల్లో చర్చ జరుగుతుందని, అంతిమంగా అది కాపు సామాజికవర్గంలో వ్యతిరేకతకు దారి తీసే ప్రమాదం ఉందని సర్కార్ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. కానీ… ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్న ప్రభుత్వ పెద్దలు ఎవరికీ తెలియకుండా జీవో ఎలా వచ్చిందన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సాధారణంగా… ఒక జీఓ ఇచ్చేటప్పుడు సంబంధిత మంత్రి..అవసరం అయితే ముఖ్యమంత్రి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడు అలాంటివే జరక్కుండానే ఉత్తర్వులు బయటికి వచ్చాయా? అందుకే 24 గంటల్లోపే వెనక్కి తీసుకున్నారా అన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. జీవో ఎలా బయటికి వచ్చినా… పర్యవసానాలను ముందుగానే ఊహించారు కాబట్టే… ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి దాన్ని ఉపసంహరించుకుని ఉండవచ్చంటున్నారు. సమస్య కాపు సామాజిక వర్గానికి సంబంధించినది కావడం, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కీలకంగా ఉండటంతో… తక్షణ స్పందన ఉండి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.