అక్కడ టీడీపీ శాసనసభ్యులకు అసలు మేం ఎమ్మెల్యేలమో కాదోనన్న అనుమానం వస్తోందా? పార్టీ అధికారంలో ఉందన్న ఆనందం కూడా వాళ్ళలో లేకుండా పోయిందా? ఇదెక్కడి ఖర్మరా… బాబూ.. అంటూ తలలు కొట్టుకుంటున్నారా? పార్టీ పవర్‌లోకి వచ్చినప్పటి నుంచి మా బతుకులు ఇలాగే ఏడిశాయని ఫ్రస్ట్రేట్ అవుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? వాళ్ళకొచ్చిన కష్టం ఏంటి? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారి కూటమి పవర్‌లోకి వచ్చాక అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీలయ్యారట ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు. ఏం… అంత ఎక్కువ ఎందుకంటే… అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు అలాంటివి అన్నది వివిధ వర్గాల నుంచి ఠక్కున వచ్చే సమాధానం. కానీ… ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదట. చివరికి ఎమ్మెల్యేలే…. ఏంటీ ఖర్మ, అహ… మాకేంటీ ఖర్మ అని తలలు బాదుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఐదేళ్ళ కష్టాల నుంచి గట్టెక్కామని రిలాక్స్ అవుతుండగానే… అంతొద్దు, కాస్త తగ్గండని చెబుతున్నాయట స్థానిక పరిస్థితులు. జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు మొదట్లో ఉత్సాహంగా, ఉల్లాసంగా తిరిగినా … క్రమంగా తత్వం బోధపడేసరికి నీరసం ఆవహిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పవర్‌లో ఉన్నాం… ఇక మనం ఏం చెబితే అది జరుగుతుందని భావించిన టీడీపీ లీడర్స్ కేడర్ పరిస్థితి అంతకు ముందు వైసీపీ హయాంలోకన్నా దారుణంగా మారినట్టు తెలుస్తోంది. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల సంగతి పక్కన పెడితే.. చివరికి ఎమ్మెల్యేలకే దిక్కులేకుండా పోతోందని, గవర్నమెంట్ ఆఫీసుల్లో వాళ్ళ మాటలకు అస్సలు విలువ ఉండటం లేదని చెప్పుకుంటున్నారు. అక్కడ ఇక్కడా అని లేదు…. ఏ డిపార్ట్‌మెంట్ చూసినా ఇదే తరహా ఇబ్బందులని అంటున్నారు. చిన్న చిన్న బదిలీల నుంచి పెద్ద కాంట్రాక్డట్ వర్క్‌లదాకా…. ఎమ్మెల్యేలు సిఫార్సులు చేయడం…. అధికారులు రియాక్ట్ అయి సరే సర్ అని చెప్పడం, తర్వాత…. ఆ…… పెద్ద చెప్పొచ్చారులే అన్నట్టు ఆ సిఫారసును పక్కన పడేయడం కామనైపోయిందట. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 నెలల నుంచి అనంతపురం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ప్రజలకు, కార్యకర్తలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలంటే ముందుగా గవర్నమెంట్ ఆఫీస్‌లో ఫైల్స్ కదలాలి.
కానీ… అట్నుంచి మాత్రం ఆ దిశగా సహకారం లేదంటున్నారు. తమకు కావాల్సిన పనుల కోసం కొందరు ఎమ్మెల్యేలు డైరెక్ట్‌గా అధికారుల దగ్గరికి వెళ్తే.. ఓకే సార్ కచ్చితంగా చేస్తాం.. పరిశీలిస్తాం సర్ అంటూ చాలా మర్యాదగా మాట్లాడుతూనే.. ఆయన గడప దాటగానే ఫైల్ పక్కన పడేసి కాలం గడిపేయడం అలవాటుగా మారిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా… చెప్పి చెప్పి విసిగిపోయిన ఎమ్మెల్యేలు… చివరకు తమ గోడును జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ముందు వెళ్ళబోసుకున్నారట. గత వైసీపీ ప్రభుత్వంలో… అడ్డగోలు వ్యవహారాలు చేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన అధికారుల పెత్తనాలు ఇప్పటికీ సాగుతున్నాయని, వాళ్ళు మమ్మల్ని అసలు లెక్క చేయడం లేదని, మేం ఎమ్మెల్యేలుగా ఉన్నామో లేదో అర్థం కావడం లేదంటూ మొత్తుకున్నట్టు తెలిసింది. అప్పుడు వాళ్ళదే పెత్తనం, ఇప్పుడు కూడా ఏదైనా పని చేద్దామంటే ఫ్తెల్ కదలనివ్వరు, ఆఫీస్ దాటి బయటకు రారంటూ ఇన్‌ఛార్జి మంత్రి టిజీ భరత్‌కు సవివరంగా చెప్పారట జిల్లా ఎమ్మెల్యేలు. కీలక శాఖల్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో పెత్తనం చెలాయించిన అధికారులే ఉండటంతో తమకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయన్నది ఉమ్మడి అనంత ఎమ్మెల్యేల బాధ. వాళ్ళ ఫిర్యాదుకు స్పందించిన మంత్రి భరత్…వెంటనే సదరు అధికారుల్ని పిలిచి ఎమ్మెల్యేల కు ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి చెప్పారట. అప్పుడు కూడా వాళ్ళు ఓకేసర్ అనే అన్నారని, ఆయన మాటన్నా వింటారా? లేక ఓకేసర్ దగ్గరే ఆగిపోతుందా అన్నది అర్ధం కావడం లేదంటున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పుడసలు ఆ మాట వింటేనే చిర్రెత్తుకొస్తోందన్నది టీడీపీ ఎమ్మెల్యేల మాట. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదేశాలతోనన్నా అనంత అధికారుల్లో మార్పు వస్తుందో లేక ఎమ్మెల్యేల ఫ్రస్ట్రేషన్ అలాగే కొనసాగుతుందా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.