Off The Record: వాలంటీర్లను ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ ప్రకంపనలు రేపుతూనే ఉన్నాయి. పవన్ కేవలం రాజకీయ వ్యాఖ్యలకే పరిమితమవకుండా.. ఎన్సీఆర్బీ డేటా అంటూ కొన్ని లెక్కలు కూడా చెప్పారు. రాష్ట్రంలో సుమారు 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని, ఇందులో వాలంటీర్ల ప్రమేయం కూడా ఉందన్నది పవన్ వ్యాఖ్యల సారాంశం. ఒంటరి మహిళలు, అమ్మాయిల కదలికలపై వాలంటీర్లు కన్నేసి ఉంచారని ఆరోపించారాయన. సాధారణంగా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను అధికార పక్షం తిప్పికొడుతుంది. కానీ… ఈ ఎపిసోడ్‌లో మాత్రం జగన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. పవన్ కళ్యాణ్ పై కోర్టులో కేసులు వేసేందుకు అనుమతిస్తూ జీవో ఇవ్వడంతో రాజకీయం హాట్ హాట్‌గా మారిపోయింది.
ఈ జీవో జారీ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ కౌంటర్ అటాక్ చేశారు. ప్రజల కోసం ప్రాణాలు పోయినా ఫర్లేదంటూ మైలేజ్ సంపాదించే ప్రయత్నం చేశారు. ఈ పాయింట్ మీదే ఇప్పుడు వైసీపీలో చర్చ జరుగుతోందట. కేసులు వేయడానికి అనుమతిచ్చి వ్యూహాత్మక తప్పిదం చేశామా అన్న ఆలోచనలో పడ్డారట పార్టీ, ప్రభుత్వ పెద్దలు. పవన్ మీద కేసులు వేయటం వల్ల రాజకీయ కక్ష సాధింపు అన్న ఆరోపణలకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందన్న వాదన వైసీపీలోనే వినిపిస్తున్నట్టు తెలిసింది. నాయకులు రాజకీయంగా చాలా మాట్లాడతారు. వాటి మీద ఇలా కోర్టులకు ఎక్కితే… అంతిమంగా అది ప్రతిపక్షాలకే మేలు చేస్తుందన్నది కొందరు వైసీపీ నేతలు ఆఫ్ ద రికార్డ్‌లో చేస్తున్న వాదన. అవసరం అనుకుంటే థర్డ్ పార్టీ చేత కేసులు పెట్టించాలి కాని… ఇలా ప్రభుత్వమే రంగంలోకి దిగటం, జీవో ఇవ్వడం కరెక్ట్ కాదన్నది ఆ నాయకుల మాటగా చెబుతున్నారు. అయితే ఈ వాదనలకు మరో కౌంటర్ కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోందట. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎమ్ పైనే అనేక విమర్శలు చేశారు. ఆ కుర్చీ పై గౌరవం లేకుండా ఏక వచనంతో సంబోధించటం మొదలు పెట్టారు. వాటన్నిటికీ… రాజకీయంగా సమాధానం చెప్పారే కాని చట్టపరమైన చర్యలు ఎప్పుడూ తీసుకోలేదు కదా అన్నది వారి వాదనగా ఉందట.
శాంతి భద్రతలు లేవనో, అవినీతి అనకొండలనో చేసిన ఆరోపణలను, అమ్మాయిల మిస్సింగ్ అంటూ చేసిన దాడిని ఒకే గాటన కట్టేయలేమన్న చర్చ మరోవైపు జరుగుతున్నట్టు తెలిసింది. మొత్తం వాలంటీర్ వ్యవస్థ పైనే ఇలాంటి ఆరోపణలు చేయటమంటే.. రాష్ట్ర ఇమేజ్ ను డ్యామేజ్ చేసే కుట్ర అని కొంత మంది నేతలు నమ్ముతున్నారట. వాలంటీర్లలో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నారని, పైగా హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి సీరియస్ ఆరోపణల్ని లైట్‌గా తీసుకోలేమని కూడా అంటున్నాట మరి కొందరు వైసీపీ నాయకులు. అటు కోర్టుకు వెళ్లాలనే నిర్ణయం వెనుక మరో వ్యూహం కూడా ఉందట. నిరాధారంగా ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అనే మెసేజ్ కూడా పంపించాలన్న ఉద్దేశం కూడా దీనికి వెనుక ఉందని అంటున్నారు. కోర్టులో ప్రభుత్వ వాదన నిలబడుతుందా లేదా అనే చర్చ కంటే వాలంటీర్ వ్యవస్థ పై పవన్ చేసిన ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లాలన్నదే ఆలోచన అని టాక్. ఈ ఎపిసోడ్ కు మరో తాజా ఉదాహరణ కూడా పార్టీలోని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు. మోడీ ఇంటి పేరు పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, వాటి మీద కోర్టు కేసులు, చివరకు రాహుల్ ఎంపీ పదవిని కోల్పోవటాన్ని ప్రస్తావిస్తున్నారట. మరి ఏపీలో ఈ పరిణామం ఎట్నుంచి ఎటు వెళ్తుందో చూడాలి.