Off The Record: రెబెల్ లీడర్ కేశినేని నాని తన సహజ శైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారా? అంటే.. ఎస్ అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. చాలా రోజుల నుంచి టీడీపీ అధినాయకత్వం తీరు మీదో.., పార్టీలోని తన ప్రత్యర్ధుల మీదో మాటల దాడి చేయడం ఆయనకు రివాజుగా మారింది. నాని రెండోసారి ఎంపీగా గెలిచినప్పటి నుంచి బెజవాడ టీడీపీలో ఇలాంటి వాతావరణమే ఉంది. పార్టీ అధినాయకత్వం విషయంలో నాని వ్యవహరిస్తున్న తీరు నచ్ఛక అధిష్టానం కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని డిసైడ్ అయ్యే… ఆయన సోదరుడు చిన్నిని రంగంలోకి దింపింది. అప్పటి నుంచి నాని ఛాన్స్ దొరికినప్పుడల్లా సొంత పార్టీలో ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. హాట్ హాట్ కామెంట్స్‌తో సెగలు పుట్టిస్తూనే ఉన్నారు. గడిచిన మూడు నెలల్లో అయితే తన సహచర నాయకుల మీద తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడ్డారాయన. బెజవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మీటింగ్ పెట్టిన ప్రతిసారీ.. మాటల తూటాలు పేల్చారు. ఇంఛార్జిలను గొట్టం గాళ్ళు, సామంత రాజులు అంటూ తిట్టి పోశారు.
నాని ఎటాకింగ్ మోడ్ కి చెక్ పెట్టడానికి డిసైడైన అధిష్టానం.. ఆయన నియోజకవర్గం పరిధిలో జరిగే పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం ఇవ్వడం మానేసింది. సొంత పార్టీ నేతలు దూరం పెట్టడంతో… ప్రభుత్వ పరంగా జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలకు కితాబు ఇస్తూ టీడీపీకి ఝలక్ ఇచ్చారు నాని. ఈ వ్యవహారంపై పార్టీలో పెద్ద చర్చే జరిగింది. అయితే ఎంత చర్చ జరిగినా.. వరుసగా పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు, వ్యాఖ్యలు చేసినా.. అట్నుంచి మాత్రం ఆయన ఆశించిన రియాక్షన్ రాలేదు. సరికదా… ప్రజల్లో అది ఆయనకే రివర్స్ కొడుతున్న సంకేతాలు వెళ్ళాయట. దీంతో ఎంపీ డైలమాలో పడ్డారట. ఎంత తిట్టినా… ఏం ఉపయోగం లేదు. అవతలి వాళ్లని రెచ్చగొట్టి తాను చేయాలనుకున్నది చేయలేకపోతున్నానంటూ ఆసహనంగా ఉన్నారట కేశినేని.
దీంతో ఇప్పుడు ఎంత తిట్టాలనిపించినా… మాటల్ని పెదవి దాటి రానీయకుండా తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నారట ఎంపీ. ప్రత్యర్థుల నుంచి రియాక్షన్ రాకపోవడం, ప్రజల్లో పలుచన కావడం రెండిటినీ దృష్టిలో ఉంచుకుని పంటి బిగువున తిట్లను ఆపుకుంటున్నారని అనుకుంటున్నారట ఆయన సన్నిహితులు. తాజాగా లోకేష్ పాదయాత్రలో సైతం అంతా తానై అన్నట్టు వ్యవహరించారట కేశినేని చిన్ని. అధిష్టానం కూడా నానిని పక్కన పెట్టేసి చిన్నికే ఆ బాధ్యతలు అప్పగించినట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ నిర్ణయం నానికి పుండు మీద కారం చల్లినట్టు అయిందట. ఇదంతా చూస్తున్న వారు మాత్రం పాపం నాని… ఒంటి చేతి చప్పట్లు కొడుతున్నారు. ఎంతో తిట్టాలని ఉన్నా… ఏమీ అనలేకపోతున్నారని సెటైరికల్‌గా మాట్లాడుకుంటున్నారట. మరి ఎన్నికల టైం దగ్గర పడేకొద్దీ ఎంపీ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.