Off The Record: తిరుపతి లోక్‌సభ స్థానం సగం చిత్తూరు జిల్లాలో, సగం నెల్లూరు జిల్లాలో ఉంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ చనిపోవడంతో ఉప ఎన్నికలో సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తి విజయం సాధించారు. వివాదరహితుడు, సౌమ్యుడు అన్న పేరున్నా.. సమస్యల పరిష్కారంలో మాత్రం వెనుకబడ్డారన్నది లోకల్ టాక్. దానికి తగ్గట్టు ఢిల్లీలో బాగానే కనిపిస్తున్నా …నియోజకవర్గంలో మాత్రం అందుబాటులో ఉండటం లేదంటున్నారు. ఎంపీతో పనులుంటే ఎవర్ని సంప్రదించాలో కూడా అర్ధం కావడం లేదట స్థానికులకు. పార్టీలో ఇంటర్నల్ టాక్ కూడా అదేనట.
ఎంపీ ఇంతవరకు తన పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారా అన్నది కూడా డౌటేనని సొంత పార్టీ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి కూడా గురుమూర్తే తిరుపతి వైసీపీ అభ్యర్థి కావచ్చన్న ప్రచారం ఓవైపు ఉన్నా… ఆయన వ్యవహారశైలి కారణంగా మార్పులకు అవకాశం లేకపోలేదన్న వాదన సైతం వినిపిస్తోంది. మరోవైపు గురుమూర్తి ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారనే చర్చ కూడా పార్టీలో జరుగుతోందట. ఆయనకూడా అసెంబ్లీ వైపే చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తిరుపతి ఎంపీ పరిధిలో సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు రిజర్వ్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ మూడింటిలో ఎక్కడో ఒక చోటి నుంచి గురుమూర్తి పోటీ చేయాలనుకుంటున్నారట. అందుకే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరగకుండా వాటిమీదే దృష్టి పెట్టారని చెప్పుకుంటున్నారు. ఎంపీ లెక్కలకు అధిష్టానం ఆలోచనలు సరిపోతాయో లేదో చూడాలి.