Off The Record: నిన్న మొన్నటి దాకా ఎడమొహం పెడమహంగా ఉన్న నేతలు ఇప్పుడు సెట్ అయ్యారా? లేక అయినట్టు కనిపిస్తున్నారా? ఇద్దరి మధ్య వ్యవహారం ముదిరిందా? లేక కుదిరిందా? అభ్యర్థిని వ్యతిరేకించిన నాయకుడికే గెలుపు బాధ్యతలు అప్పగించడాన్ని ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు? ఏదా నియోజకవర్గం? ఎవరా ఇద్దరు ముఖ్య నేతలు?
తెలంగాణ కాంగ్రెస్‌లోని ఆ ఇద్దరు ముఖ్య నేతల సంబంధాల గురించే గట్టి చర్చ జరుగుతోంది. పార్టీలో భేదాభిప్రాయాలు.. భిన్న వ్యక్తీకరణలు సహజమే అయినా….లోక్‌సభ ఎన్నికల టైంలో ఇద్దరూ సెట్ అయ్యారా? కాలేదా అన్న అంశం చుట్టూ చర్చ జరుగుతోంది. అంతలా ఎందుకంటే… పెద్దపల్లి లోక్‌సభ టిక్కెట్ కేంద్రంగా జరిగిన రాజకీయమే కారణం అంటున్నారు. ఇక్కడ అభ్యర్థిగా ఎమ్మెల్యే జి.వివేక్ కుమారుడు వంశీని ప్రకటించింది హై కమాండ్. అంతకు ముందు నుంచే వంశీ అభ్యర్థిత్వాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో సహా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. చివరికి పార్టీ పెద్దలు వంశీవైపు మొగ్గడమే కాకుండా… ఇక్కడ ఎన్నికల ఇన్ఛార్జ్‌గా శ్రీధర్‌బాబునే నియమించి గెలుపు బాధ్యతను ఆయన భుజానే పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌ని గెల్చుకుంది కాంగ్రెస్. ఆ ఏడింటిలో రెండు వంశీ తండ్రి వివేక్, పెదనాన్న వినోద్ గెలిచినవే ఉన్నాయి. ఇక సామాజిక సమీకరణాల పరంగా టిక్కెట్ ఇచ్చే టైంలో పార్టీలో మినీ వార్ జరిగింది. ఒకే కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఆ కుటుంబానికేనా? అనే చర్చను తీసుకు వచ్చారు వివేక్ వ్యతిరేక శిబిరం నేతలు. పైగా వివేక్, వినోద్ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా మాల సామాజిక వర్గం నుంచే ఉన్నప్పుడు పార్లమెంటు సీటుని మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని పట్టుబట్టారు శ్రీధర్ బాబు. కానీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షీ మాత్రం ఎన్నికలకు ముందు వాళ్లకు మాటిచ్చాం. ఇప్పుడు టిక్కెట్ ఇస్తున్నామంటూ స్పష్టం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు మాత్రం మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ వచ్చారు. ఆఖరికి కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు కూడా ఇదే అంశంపై స్పష్టతనిచ్చారు. మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వకపోతే రాజకీయంగా ఇబ్బంది పడతామని చెప్పారు. కానీ ఫైనల్ గా వివేక్ కుమారుడు వంశీకి టికెట్ ఇచ్చింది అధిష్టానం.
మొన్నటి వరకు వద్దనుకున్న అభ్యర్థి ఇప్పుడు బరిలో నిలిచారు. మంత్రి శ్రీధర్ బాబుకి ఆ నియోజకవర్గాన్ని గెలిపించుకొని వచ్చే బాధ్యతను కూడా అప్పగించింది పార్టీ. ఈ పరిస్థితుల్లో శ్రీధర్ బాబు, వివేక్ మధ్య వివాదం సర్దుమణిగినట్టేనా..? లేదంటే ఎవరి పనివారు చేసుకుంటున్నారా ? అనే చర్చ తెరమిదకి వచ్చింది. తాజాగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మీటింగ్ జరిగింది. పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కలిసి పనిచేస్తామంటూ అంతా ఐక్యత రాగాన్నే పలికారు. ఇన్నాళ్లు వంశీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నేతలు కూడా వెంకటస్వామి సేవలను గుర్తు చేస్తూ వంశీని గెలిపిస్తామంటూ ప్రకటనలు చేశారు. పంచాయతీ అభ్యర్థిని ప్రకటించే వరకే అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఒకసారి పార్టీ నిర్ణయం తీసుకున్నాక అభ్యర్థి కోసం పనిచేయాల్సిందే అనేది ఫైనల్ అంటున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రస్తుతం పెద్దపెల్లి నియోజకవర్గ ఇన్చార్జ్. మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇప్పించే ప్రయత్నంలో ఆఖరి వరకు చెమటోడ్చారుగానీ… దక్కించుకోలేకపోయారు. జిల్లాలో మాదిగ సామాజిక వర్గం నుంచి శ్రీధర్ బాబు పై ఒత్తిడి కూడా ఎక్కువే ఉందంటున్నారు. వీటన్నింటిని ఆయన ఎలా నెగ్గుకు వస్తారు? గత వైరాన్ని పక్కనబెట్టి పార్టీ లైన్ ప్రకారం వివేక్ కొడుకుని గెలిపించేందుకు కృషి చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.