Off The Record: కేంద్రంలో నరేంద్రమోడీ సర్కార్ అధికారంలోకి వచ్చి 9ఏళ్ళు పూర్తయిన సందర్భంగా…దేశవ్యాప్తంగా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమం చేపట్టింది బీజేపీ. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్ళాలన్నది ఈ నెల రోజుల కార్యక్రమం లక్ష్యం. దాంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా.. బీజేపీ అనుబంధ మోర్చాల ఉమ్మడి సమ్మేళనాలు, మేధావులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని ప్రోగ్రాం ఇచ్చింది పార్టీ. ఈనెల 15 నుంచి 22 దాకా అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టాలని కూడా సూచించింది. అయితే…ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలుండి, ఈసారి అధికారంలోకి రావాలనుకుంటున్న తెలంగాణలో ఈ కార్యక్రమాలు ఎంతవరకు అమలవుతున్నాయన్నది పార్టీ నేతలకే అంతుబట్టడం లేదట. జాతీయ స్థాయి నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు తప్ప రాష్ట్రంలో పెద్దగా చురుకుముట్టినట్టు లేదన్నది పొలిటికల్ టాక్.
పార్టీ నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు వచ్చారు. ఒకటి రెండు రోజులు ఉన్నారు. ప్రకాష్ జవదేకర్ అయితే.. 6 రోజులు తెలంగాణలోనే ఉండి తన తిప్పలేవో తానుపడి వెళ్ళిపోయారు. కానీ… ఇక్కడి నాయకులెవరూ…పెద్దగా వాళ్ళతో కలిసి పాల్గొన్నట్టు కనిపించలేదు. పాత నేతల సంగతి పక్కనపెడితే… వలస నాయకులు అస్సలు పట్టించుకోలేదట. అంతా టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉన్నారట. వాళ్ళసలు తమ సొంత నియోజకర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయలేదంటున్నాయి పార్టీ వర్గాలు. కొందరు నేతల్ని పిలిచి ప్రోగ్రామ్ ఇచ్చినా… నియోజకవర్గాలకు వెళ్ళేందుకు అస్సలు ఆసక్తి చూపించలేదని తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగిన సభల్ని కూడా వేళ్ళమీదే లెక్కించవచ్చంటున్నారు.
అభియాన్‌కు అనుకున్నంత ప్రాధాన్యం దక్కకపోవడానికి కారణం అంతర్గత విభేదాలేనని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఉండాలా? బయటికి పోవాలా? అన్న మీమాంసలో వలస నాయకులు, వాళ్ళు చూసుకుంటారులే అన్న ధోరణిలో పాత నేతలు ఉండి… అంతా కలిసి ప్రోగ్రామ్‌ని అట్టర్ ఫ్లాప్ చేశారన్నది టి బీజేపీ కేడర్ ఆవేదన. వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ… రాష్ట్రంలో పార్టీని నాశనం చేస్తున్నారని ఆవేదనగా ఉన్నారట కార్యకర్తలు. వెళ్ళేవాళ్లు వెళ్ళాలి, ఉండాలనుకుంటే పార్టీలైన్‌కు కట్టుబడి పనిచేయాలి గానీ…ఇలా చేయడమేంటని అంటోందట కేడర్. అటు అమిత్ షా సభ వాయిదా పడటం కూడా… పార్టీ శ్రేణుల్ని నిరాశ పర్చిందట. ఎన్నికల ముంగిట్లో…. ముందు ముందు చేపట్టబోయే కార్యక్రమాలైనా సక్సెస్ అవుతాయా లేక ఇలాగే ఉంటాయా అన్న ఆందోళన కూడా టీ బీజేపీ వర్గాల్లో వ్యక్తం అవుతోందట.