Off The Record: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈసారి కూడా ప్రతిపక్షం లేకుండానే జరిగాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవడం మినహా… ఆ తర్వాత వైసీపీ నుంచి హాజరు లేదు. అదే సమయంలో… కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది కాస్త ముందుకు వెళ్ళి…. వాళ్ళు లేకపోతేనేం…. మేమున్నాంగా…. అంటూ, ఏకంగా ప్రతిపక్ష పాత్ర పోషించేశారు. ధూళిపాళ్ళ నరేంద్ర, కూన రవికుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి… ఇలా కొంతమంది సభ్యులు కీలక ప్రశ్నలు అడిగారు. అంతవరకు బాగానే ఉన్నా…. అడిగిన ప్రశ్నలు, అడపాదడపా జరుగుతున్న ప్రచారాన్ని పోల్చి చూసుకుంటే…. ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టుగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. వాళ్ళ క్వశ్చన్స్ ఒకరకంగా… ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోందట. అసలు ప్రతిపక్షం సభలో ఉన్నా…. అలాంటి ప్రశ్నలు అడిగేదో లేదోనని టీడీపీ సభ్యులే గుసగుసలాడుకుంటున్నట్టు సమాచారం. ప్రధానంగా కూన రవికుమార్ కొన్ని ప్రశ్నలతో బాగానే ఇరుకున పెట్టారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట పార్టీ వర్గాల్లో.
రాజీవ్ గృహకల్పతో పాటు సహకార బ్యాంకుల్లో అవినీతి, కేంద్ర పథకాలు…. ఇలా రకరకాల అంశాలకు సంబంధించిన ప్రశ్నలు సంధించారు కూన. అలాగే కొన్నిటికి సరైన సమాధానం రాలేదని కూడా అసంతృప్తి వ్యక్తం చేశారాయన. అధికారులు సరైన సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారంటూ కోప్పడ్డారు కూడా. అదే స్థానంలో ప్రతిపక్ష సభ్యుడు ఉంటే… ప్రభుత్వం సమాధానం చెప్పడంలేనది అనే వాడని, కూన అధికార పార్టీ సభ్యుడు కాబట్టి…. నెపాన్ని అధికారుల మీదికి నెట్టారు తప్ప… పెద్ద తేడా ఏం లేదన్న టాక్ నడుస్తోంది. వీటన్నిటి మీద ప్రభుత్వ వర్గాలతో పాటు పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా చర్చ జరుగుతోంది. అలాగే సీనియర్ సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర, గోరంట్ల చౌదరి కూడా ఇదే రకమైన ప్రశ్నలు అడగడం కనిపించింది. సహకార బ్యాంకుల్లో అవినీతి, రోడ్లు, ఇలా కొన్ని కీలక సబ్జెక్టులకు సంబంధించి అధికారులు, మంత్రులను సైతం ఇరుకున పెట్టేలా ప్రశ్నించారు సభ్యులు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నాటి రాజీవ్ గృహకల్ప సంబంధించి ఇప్పుడు ప్రశ్నలు అడగడం, వాటికి ఆఫీసర్స్ సమాధానాలు ఇవ్వడం కూడా ఇబ్బందిగా మారిందట. ఒకానొక దశలో అధికారులు ఎందుకు సమాధానం పంపించట్లేదనే చర్చ కూడా సభలో జరిగింది. స్వయంగా ఒక మంత్రి అధికారుల తీరు పై అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. దీంతో కూటమి సభ్యులు ప్రతిపక్ష పాత్ర గట్టిగానే పోషిస్తున్నారన్న అభిప్రాయం బలపడింది.
సాధారణంగా ప్రతిపక్షం ఉంటే… అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతుంటాయి. ప్రతిపక్షంలో పదిమంది సభ్యులు ఉన్నా అసెంబ్లీలో హైలైట్ అవుతారు. కానీ.. వైసీపీ పూర్తిగా వదిలేయడంతో ఇప్పుడు టిడిపి మెంబర్సే కీలకంగా మారారు. వాళ్ళు ప్రశ్నలతో సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే కాకుండా కొన్ని క్వశ్చన్స్‌కు సరైన సమాధానం కూడా ఇవ్వలేకపోయారట. ఏదో తూతూ మంత్రంగా వ్యవహారాన్ని నడిపించకుండా…బాగా డెప్త్‌కు వెళ్లి అడిగిన ప్రశ్నకు గట్టి చర్చే పెట్టినట్టు చెప్పుకుంటున్నాయి. ప్రతిపక్ష సభ్యులకంటే ఘాటుగా, గట్టిగా టీడీపీ సీనియర్స్ క్వశ్చన్స్ అడిగి సమాధానాలు రాబట్టుకున్నారన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఇక్కడో కొత్త రాజకీయ కోణం కూడా కనిపిస్తోందని అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఇప్పుడు గట్టి ప్రశ్నలు అడిగారని అనుకుంటున్న ముగ్గురు సీనియర్స్ మంత్రి పదవులు ఆశించినవారే. వివిధ సమీకరణల కారణంగా సాధ్యపడలేదు. అందుకే కసిగా మేమేంటో చూపిస్తామన్నట్టు బాగా లోతుల్లోకి వెళ్ళి ప్రశ్నలు అడిగి ఇరుకున పెట్టి ఉంటారా అన్న చర్చ సైతం జరుగుతోంది. మొత్తం మీద వాళ్ళ ఉద్దేశ్యాలు ఏవైనా… ప్రతిపక్షం ఉన్నప్పటికంటే దీటుగా క్వశ్చన్ అవర్‌ను నడిపించారన్న మాటలు మాత్రం వినిపిస్తున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో.