Off The Record: తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజుల నుంచి సమాధానం లేని ప్రశ్నగా మిగిలిన అంశం అమిత్ షా-చంద్రబాబు భేటీ. ఇద్దరూ సుమారు 50 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. మీటింగ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొన్నారు. దీంతో ఈ రెండు పార్టీలు తిరిగి పొత్తులు పెట్టుకోబోతున్నాయా..? మళ్లీ 2014 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందా..? అనే చర్చ అప్పటి నుంచి జరుగుతోంది. అదే సమయంలో తెలంగాణలో కొందరు బీజేపీ నేతలు టీడీపీతో కలిసివెళ్ళడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వీరి మధ్య పొత్తు నేరుగా ఉంటుందా..? లేక లోపాయికారీగా ఉంటుందా..? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ అవగాహన ఉంటే…అది తెలంగాణకే పరిమితం అవుతుందా? లేక ఏపీలో కూడా ఉంటుందా..? అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇన్ని రకాల ప్రశ్నలు.. ఇన్ని రకాల అనుమానాలున్నా.. వీటికి ఇప్పటికీ సరైన సమాధానం మాత్రం లేదు.
ఢిల్లీ భేటీ, దాని చుట్టూ పెరుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం రెండు వర్గాలు చేయడం లేదు. బయటికి ఎలాంటి ప్రకటన.. కామెంట్స్ లేకున్నా.. ఆయా పార్టీ వర్గాల్లో మాత్రం విస్తృతంగా చర్చ జరుగుతోంది. పొత్తు అంటూ ఉంటే.. అది డైరెక్టుగానే ఉంటుంది తప్ప.. పరోక్ష అవకాశాలు తక్కువేనంటున్నారు. లోపాయికారీగా పొత్తు పెట్టుకున్నంత మాత్రాన టీడీపీ ఓట్లు బీజేపీకి పూర్తి స్థాయిలో బదిలీ అయ్యే అవకాశాలు తక్కువేనంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ ఓటర్లు, సానుభూతి పరులు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు షిఫ్ట్ అయిపోయారు. ఈ క్రమంలో పాత టీడీపీ ఓటు బ్యాంకు బీజేపీకి కావాలంటే డైరెక్ట్ పొత్తు మినహా..మరో మార్గం లేదంటున్నారు. లోపాయికారీ ఒప్పందాలతో ఒరిగేదేం ఉండదన్నది పొలిటికల్ పండిట్స్ చెప్పే మాట. అయితే నేరుగా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి తెలంగాణలోని కొందరు కమలనాధులు ఊ అంటున్నా.. ఇంకొందరు మాత్రం ఊహూ అంటున్నారట. దీంతో డైలమా పెరిగిపోతోంది.
అయితే చంద్రబాబును తమ దగ్గరికి పిలిపించుకుని.. 50 నిమిషాలకు పైగా చర్చలు జరిపారంటే.. కచ్చితంగా పొత్తుల దిశగానే అడుగులు పడుతున్నాయన్న భావన వ్యక్తమవుతోంది. స్పష్టత లేకుండా చంద్రబాబును నేరుగా తమ నివాసానికి అమిత్ షా పిలిపించుకోరని.. అందునా జేపీ నడ్డా ఆ సమావేశంలో పాల్గొనేవారే కాదని అంటున్నారు. నడ్డా పాల్గొన్నారంటేనే కథ క్లియర్‌గా ఉందని.. పొత్తుల దిశగానే అడుగులు పడుతున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. అలాగే చంద్రబాబు కూడా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీని కాదని.. దూరంగా జరిగే పరిస్థితుల్లో లేరని అంటున్నారు. తెలంగాణలో ఎలా ఉన్నా… ఏపీలో మాత్రం టీడీపీకి ఈసారి నౌ ఆర్ నెవ్వర్ అనే పరిస్థితి ఉంది. అందుకే గతంలోలాగా రిస్క్ తీసుకోవడం మంచిది కాదని చంద్రబాబు అనుకుంటున్నట్టు తెలిసింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య రెండు రాష్ట్రాల్లో డైరెక్ట్ గానే పొత్తు ఉండవచ్చంటున్నారు. లోపాయికారీ ఒప్పందమో లేక పొత్తుల్లేకుండా వెళ్లాలంటే ఏదైనా అనూహ్య పరిణామాలు జరగాల్సిందేనంటున్నారు.
తెలంగాణలో లోపాయికారీ ఒప్పందంతో వెళ్తే ఆ ఎన్నికల్లో ఫలితాలు తేడాగా వస్తే.. ఏపీలో టీడీపీ పరిస్థితి ఇరకాటంలో పడుతుందన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయమట. చంద్రబాబు కూడా అమిత్ షా-జేపీ నడ్డాలతో ఇదే విషయాన్ని చెప్పి ఉండొచ్చని భావిస్తున్నాయి టీడీపీ వర్గాలు. ఆ భేటీ గురించి చంద్రబాబు ఇప్పటిదాకా నేతల దగ్గర కూడా ఎలాంటి ప్రస్తావన తీసుకురాకున్నా.. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు.. పార్టీకున్న అవసరాలు చూస్తే.. చంద్రబాబు ఇదే తరహాలో మాట్లాడి ఉంటారనే అంచనాకు వస్తున్నాయట టీడీపీ వర్గాలు. అలాగే టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు కుదర్చాలన్న పవన్ ప్రయత్నాలు దాదాపు సక్సెస్ అయ్యాయనే మాటలు వినపడుతున్నాయి. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకున్న పవన్.. 2014 కాంబినేషన్ అయితేనే వర్కవుట్ అవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. ఓవైపు తెలంగాణ పరిస్థితులు, మరోవైపు పవన్ రాయబారాల వల్ల పాత మిత్రుల కలయిక మళ్లీ జరుగబోతోందనే ఫీలింగ్ టీడీపీ-బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీని మీద స్పష్టత రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.