Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో 25కోట్ల రూపాయల పంచాయతీ కాక రేపుతూనే ఉంది. మునుగోడు ఉప ఎన్నిక టైంలో అధికార బీఆర్‌ఎస్ నుంచి తెలంగాణ కాంగ్రెస్‌కు పాతిక కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించడం,.. దాన్ని కౌంటర్ చేస్తూ… పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయడంతో…రాజకీయం హీటెక్కింది. ఆ తర్వాత 25 కోట్లు వ్యక్తిగతంగా రేవంత్‌కి ఇచ్చారని మేము ఆనలేదంటూ..ఈటెల, బండి సంజయ్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌లో ఇప్పుడు ఇంకో రకమైన చర్చ మొదలైందట. నిజంగానే ఇచ్చి ఉంటే.. ఆ పాతిక కోట్లు పార్టీలో ఎవరికి ముట్టాయి? ఎటు పోయాయన్న చర్చ గాంధీభవన్‌లో మొదలైందట.
Read Also: Off The Record: కన్నా, రాయపాటి వార్ మళ్లీ మొదలైందా..? కలకలం రేపుతున్న రాయపాటి వ్యాఖ్యలు
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మొత్తం పీసీసీ చీఫ్ రేవంత్ ఆధ్వర్యంలో జరిగింది. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర రెడ్డి, అభ్యర్థి పాల్వాయి స్రవంతితో పాటు..పార్టీకి చెందిన డీసీసీ అధ్యక్షులు మండల వారీగా ఇన్చార్జిలుగా పనిచేశారు. అధికార పార్టీ నుంచి డబ్బులు వెళితే నేరుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వెళ్ళాలి. కానీ.. ఆయనకు వెళ్ళలేదని ఈటెల చెప్పిన మాటలు ఇప్పుడు టి కాంగ్రెస్‌లో పరస్పరం అనుమానపు చూపులకు కారణం అవుతున్నాయట. ఒకవేళ డబ్బు ఇచ్చింది నిజమే అయితే… పీసీసీకి కాకుండా ఇంకెవరికి ఇచ్చారు? ఎవరికైనా ఇస్తే… వ్యక్తులకు ఇచ్చినదాన్ని పార్టీకి ఎలా ఆపాదిస్తారన్న చర్చలు జరుగుతున్నాయట. రేవంత్ అమ్మవారి మీద ప్రమాణం చేయడంతో … ఆయనకు సంబంధం లేదని ఆరోపణలు చేసిన వ్యక్తులే స్పష్టం చేశారు. మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.
Read Also: Off The Record: ఇదేం కాంబినేషన్ దేవుడా?
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చుపెట్టింది ఎంత అనేది బయటి వారికి తెలిసే అవకాశం లేదు. పిసిసి ఛీఫ్‌గా రేవంత్ రెడ్డికి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జితో పాటుగా జిల్లాకు చెందిన కీలక నాయకులకు మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి. కానీ.. అసలీ ఆరోపణలు ఎందుకు వచ్చాయి? నిజంగానే డబ్బు ఇచ్చి ఉంటే… ఇప్పుడు ఎవరి ద్వారా బయటికి వచ్చిందన్న కోణంలో ఆరా తీస్తోందట రేవంత్ వర్గం. అందులో భాగంగా అన్ని వేళ్లు ఒకవైపు చూపిస్తున్నాయట. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపిలో చేరిన నాయకుడు ఈటల రాజేందర్ మీడియా సమావేశం కంటే ముందు వరుసగా రెండు రోజులపాటు ఆయన నివాసానికి వెళ్ళినట్టు సమాచారం అందిందట. ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉన్న ఓ సీనియర్ నేత బిజెపిలో చేరిన ఆ నాయకుడితో ఇలాంటి ఆరోపణలు చేయించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారట. తమను ఇరుకున పెట్టేందుకే సదరు నేత ఈ పాతిక కోట్ల పంచాయతీ పెట్టినట్టు అనుమానిస్తోందట రేవంత్ వర్గం. దీనికి తోడు ఈటల సవాల్ తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎవరూ స్పందించలేదు. కానీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ మాత్రమే ఈటెలను, రేవంత్‌ను కలిపి 25 కోట్లకు అమ్ముడు పోయారు.. అంటూ విమర్శలు చేశారు. ఓవైపు బీజేపీ, కాంగ్రెస్ మధ్య 25 కోట్ల పంచాయతీ జరుగుతుంటే… మధ్యలో పాడి కౌశిక్ రెడ్డి రేవంత్, ఈటెల మధ్య సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేయడంతో మరో రకమైన చర్చ మీదికి వచ్చింది.
మునుగోడులో 25 కోట్ల పంచాయతీ పై ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరు స్పందించలేదు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వారు కూడా నోరు మెదపలేదు . అదంతా పీసీసీ చూసుకుంటుంది అనుకున్నారా… లేదంటే రేవంత్‌కు సంబంధం లేదని బిజెపి నేతలు ప్రకటించిన తర్వాత తిరిగి తిరిగి ఎవరి మీదికి వస్తుందని అనుకుంటున్నారో గానీ.. అంతా గప్‌చుప్‌గా ఉన్నారు. రేవంత్‌రెడ్డి శిబిరం మాత్రం ఇదంతా సొంత పార్టీలో గిట్టనివారు చేయించిన పనిగానే అనుమానిస్తోంది. పార్టీపై ఆరోపణలు వస్తుంటే కనీసం సీనియర్ నేతలు కానీ, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాయకులు గాని స్పందించకపోవడంపై కూడా ఏఐసీసీ ముఖ్య నాయకుల వద్ద చర్చకు పెట్టినట్టు సమాచారం. చూడాలి మరి ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో.