Off The Record: అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి. 2014లో టీడీపీ తరఫున గెలిచిన మేడా.. 2019ఎన్నికల నాటికి వైసీపీలో చేరి, గతంలో తాను ఓడించిన మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు అడుగులు వేశారు. పార్టీ మారినా మేడాకే టికెట్ ఇచ్చింది వైసీపీ అధినాయకత్వం. అలాగే ఆకేపాటికి హామీ మేరకు ఉమ్మడి కడప జడ్పీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. కానీ.. మేడా వైసీపీ ఎమ్మెల్యేగా గెలవడంతోనే రాజంపేటలో ఆధిపత్య పోరు మొదలైంది. ఇద్దరు నాయకులు పైకి సఖ్యతగానే కనిపిస్తున్నా…. లోలోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నారట. ప్రతి సందర్భంలోనూ ఘర్షణ వాతావరణమే కనిపిస్తుండటంతో పార్టీ కేడర్‌లో కూడా గందరగోళం పెరుగుతోంది.
పెద్దల జోక్యంతో కొద్ది రోజుల క్రితం అంతా సద్దుమణిగినట్టే కనిపించింది. ఇద్దరు నాయకులు ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి అన్ని కార్యక్రమాలకు కలియతిరిగేశారు. ఇరు వర్గాల మధ్య ఆరోపణలు, ఫిర్యాదులు ఆగిపోయాయి కూడా. ఇక ఆల్‌సెట్ అనుకుంటున్న టైంలో… ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల రూపంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఒంటిమిట్ట రాములవారి ఆలయ పరిసరాల్లో మేడా మల్లికార్జున తరఫున వేసిన ప్లెక్సీలను కొందరు చించేశారు. సీసీ కెమెరా ఫుటేజీ చూసి ముగ్గురిని అరెస్టుచేశారు పోలీసులు. అదే టైంలో దీని వెనుక ఆకేపాటి వర్గీయుల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ గొడవ సద్దుమణగక ముందే…రాజంపేటలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. జగనన్నా నువ్వే మా భవిష్యత్తు… కానీ రాజంపేట ఎమ్మెల్యేపై మాకు నమ్మకం లేదంటూ చాలా ఏరియాల్లో పోస్టర్లు పడటంతో ఎమ్మెల్యే వర్గం రగిలిపోతోందట. దాంతో పాటు వైసిపీలో మోసపోయిన నాయకులు, కార్యకర్తలు అంటూ జిరాక్స్ చేసిన పోస్టర్లు కలకలం రేపాయి. పోస్టర్స్ వేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేయగా…చూసీ చూడనట్టు పొమ్మని పార్టీనిలోని పెద్దలనుంచి ఫోన్లు వెళ్ళాయట. ఇది ఖచ్చితంగా తన ప్రత్యర్థి వర్గంపనేనని నమ్ముతోంది ఎమ్మెల్యే వర్గం. స్వయంగా ఎమ్మెల్యేనే ఫిర్యాదు చేసినా… పోలీసులు పట్టీ పట్టనట్టు ఉండటంపై పార్టీలోనే ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. లోలోపల రగిలిపోతున్నా.. ఈ పోస్టర్ల వ్యవహారంపై ఇటు మేడా కానీ… అటు ఆకేపాటిగానీ అధికారికంగా స్పందించలేదు.
మేడా, ఆకేపాటి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న క్రమంలోనే ఎంపీ మిథున్‌రెడ్డి మేనల్లుడు గాలివీడు విజయసాగర్ రెడ్డి కూడా ఏడాది క్రితం రాజంపేట టిక్కెట్ రేసులోకి వచ్చారు. అప్పట్లో నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉన్నారాయన. ఆకేపాటి వర్గమంతా ఆయనకు మద్దతిస్తోందని ఒక దశలో బాగా ప్రచారం చేశారు. దీంతో ఒంటరినయ్యానన్న ఫీలింగ్‌తో ఉన్న ఎమ్మెల్యే మేడా పార్టీ మారతారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల టైం దగ్గర పడేకొద్దీ…ఇరు వర్గాల మధ్య రాజుకుంటున్న వివాదం ఏ టర్న్ తీసుకుంటుందో అర్ధంకాక కంగారు పడుతున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు. పార్టీ పెద్దలు కొందరు ఆకేపాటికే మద్దతుగా ఉన్నారన్న ప్రచారం నడుమ మేడా మల్లిఖార్జున రెడ్డి ఎలా ముందుకు వెళతారన్న అంశం ఆసక్తికరంగా మారింది. వ్యవహారం ఎన్నికలనాటికి సర్దుబాటు కాకుంటే…పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.