Off The Record: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లలో గెలిచింది జనసేన. ఇక కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో… కీలకంగా ఉన్నారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అంతవరకు బాగానే ఉంది. కానీ, రానురాను ఆయన వైఖరి మాత్రం జనసైనికులకు నచ్చడం లేదట. వేదికల మీద ఆయన నవ్వుతూ సమాధానాలు చెబుతున్నా… మాకు మాత్రం కాలిపోతోందని నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం అంటున్నట్టు తెలుస్తోంది. పార్టీ గెలిచింది… పవర్‌లో ఉన్నామన్న ఆనందంకంటే… మా కష్టాలను పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడన్న బాధ పెరిగిపోతోందట వాళ్ళలో. ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఓకే అనుకున్నా… దాదాపుగా మిగతా అన్ని సెగ్మెంట్స్‌లో ఇదే పరిస్థితి ఉందని, ఇలాగే ఉంటే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కనుమరుగవడం ఖాయమని అంటున్నారట. మేం పార్టీ పెట్టినపుడు జెండా భుజానికి ఎత్తుకున్నాం. ఏళ్ళ తరబడి పోరాడుతూనే ఉన్నాం. కనీసం ఇప్పుడు… అధికారంలోకి వచ్చినప్పడన్నా… మా బాధలు వినేవాళ్ళు లేకుండా పోయారు. చెప్పుకోవడానికి చాలా చోట్ల నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లు లేరంటూ బాధపడుతున్నారట జనసైనికులు.
Read Also: Sonam Raghuvanshi Case: ‘‘ఈ కేసు సమాజానికి గుణపాఠం’’.. హనీమూన్ మర్డర్‌పై సీఎం మోహన్ యాదవ్..
మొత్తం 175 నియోజకవర్గాలకుగాను… మెజార్టీ స్థానాల్లో… జనసేన ఇన్ఛార్జ్‌లు లేరని, అలాగని కూటమిలోని మిగతా రెండు పార్టీల నాయకుల దగ్గరికి వెళ్తే అస్సలు పట్టించుకోవడంలేదని, ఇలా ఇంకెన్ని ఏళ్ళు అంటూ… తమ అధిష్టానాన్నే నిలదీస్తున్నారు గ్లాస్ పార్టీ కార్యకర్తలు. అసలు అధికారంలో ఉన్నామా? లేక ఇప్పటికీ ప్రతిపక్షంలోనే ఉన్నామా అన్నది అర్ధం కావడంలేదని వాపోతున్నారట. ఇటు స్థానికంగా ఇన్ఛార్జ్ లేక, అటు అధిష్టాన పెద్దలను కలిసే అవకాశం రాక… సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో, గోడు ఎలా వెళ్ళబోసుకవాలో అర్దం కావడంలేదంటూ జనసేన నియోజకవర్గ నాయకులు తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీకి కంచుకోటల్లాంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్‌లు లేరంటే… పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నది కేడర్ వాయిస్.
Read Also: TG Poice: సైకిళ్లపై గ్రామ సందర్శన చేసిన వంగర పోలీసులు..
ఇక, గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడా కమిటీలు లేవు. పార్టీ నిర్మాణం సరిగా జరక్కుండా… కేవలం పవన్ చరిష్మా మీదనో, లేక అభిమానుల ఊపుతోనో ఎక్కువ కాలం బండి లాగించలేమని, పూర్తి కమిటీల్ని నియమించుకుంటేనే… క్షేత్ర స్థాయిలో పునాదులు పటిష్టం అవుతాయని జనసేన కేడరే అంటున్న పరిస్థితి. తుని, ప్రత్తిపాడు, రాజమండ్రి, అనపర్తి, ముమ్మిడివరం, అమలాపురం, రామచంద్రపురం వంటి నియోజకవర్గాల్లో… నాయకత్వలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, అదే కేడర్‌లో వివాదాలకు కారణం అవుతోందని అంటున్నారు గ్లాస్ లీడర్స్. కింది స్థాయి కేడర్ తమ బాధలు చెప్పుకునేందుకు నాయకత్వం అందుబాటులో లేకపోవడంతో అసహనం పెరుగుతోందట. ఇంకెన్ని ఏళ్ళు ఇలా మౌనంగా ఉండాలి? మమ్మల్ని పట్టించుకునేది ఎవరంటూ రగిలిపోతున్నారట జనసైనికులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా… జనసేనకు ఇదే సమస్య అవుతోందట. మెజార్టీ స్థానాల్లో ఇన్ఛార్జ్‌లు లేకపోవడమే అసలు సమస్య అంటున్నారు. అధిష్టానం ఈ దిశగా దృష్టి పెట్టడంతో పాటు… సొంతగా బలం పెంచుకునే ప్రయత్నాలు జరిగితేనే ఉపయోగం అన్నది జనసేన కేడర్ వాయిస్.