Off The Record: ఎన్నికల ముంగిట్లో.. విశాఖ జిల్లాలో కుదుపులు మొదలయ్యాయి. తొలి షాక్ అధికార పార్టీకే తగిలింది. వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పదవికి, పార్టీకి రాజీనామా చేయడం కేడర్‌ని కలవరపెడుతోందట. ఉరుముల్లేని పిడుగులా… ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా…ఈ పరిణామం జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆయన రాజీనామాకు దారితీసిన అంశాలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయట. విశాఖ జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత పంచకర్ల రమేష్ బాబు. పోర్టు ఆధారిత వ్యాపారం చేస్తూ 2009కి ముందు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం తరపున తొలిసారి పెందుర్తి నుంచి గెలిచారాయన. పీఆర్పీ విలీనం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే గా కొనసాగుతూనే 2014కు ముందు టీడీపీలోకి జంప్ అయ్యారు. 2019నాటికి యలమంచిలిలో టీడీపీ గ్రాఫ్ పడిపోగా….రమేష్ బాబుపై సిట్టింగ్ ఎమ్మెల్యే రమణమూర్తి రాజు విజయం సాధించారు. తనతో పాటు జిల్లాలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించి టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షపదవికి రాజీనామా చేశారాయన. తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉన్న పంచకర్లకు వైసీపీ రెడ్ కార్పెట్ పరిచింది. జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ను ఆకస్మికంగా తప్పించి ఆ స్థానంలో పంచకర్లకు అవకాశం ఇచ్చింది. అప్పట్లో రమేష్ బాబు నియామకం ఎంత అకస్మాత్తుగా జరిగిందో…ఇప్పుడు పార్టీ నుంచి ఎగ్జిట్ అంతే అనూహ్యంగా జరిగిపోయింది. దీనిపై రాజకీయ వర్గాల్ల పెద్ద చర్చే జరుగుతోంది.
కాపుల ప్రభావం ఎక్కువగా ఉండే పెందుర్తి నుంచి ఈసారి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు రమేష్‌బాబు. ఆ దిశగా పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో తీవ్ర అసహనంగా ఉన్నారట ఆయన. ఒకటి రెండు సార్లు నియోజకవర్గంలో తిరిగేందుకు చేసిన ప్రయత్నాలను సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ తీవ్రంగా ప్రతిఘటించారు. చివరికి రమేష్ బాబు నీడను కూడా అదీప్ సహించని పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్ని భారీ ఎత్తున నిర్వహించారు అదీప్. మూడు మండలాల నుంచి వేలాది మందిని రప్పించి రేస్‌లో నేనున్నానని గట్టిగా చెప్పకనే చెప్పారట. అదే వేదికపై సిట్టింగ్ ఎమ్మెల్యేకు మరో జాక్ పాట్ దొరికింది. సీటు కోసం తీవ్రమైన పోటీ ఉన్న తరుణంలో వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధి అదీప్ రాజేనని బహిరంగ వేదికపై ప్రకటించారు వైవీ సుబ్బారెడ్డి. రీజినల్ కో ఆర్డినేటర్ నోటి వెంట వెలువడిన ప్రకటనతో ఎమ్మెల్యేకు వెయ్యేనుగుల బలం వచ్చినట్టైందని సొంతపార్టీ నేతలే చర్చించుకున్నారు. సరిగ్గా ఇక్కడి నుంచే పంచకర్లలో అసంతృప్తి కట్టలు తెంచుకుందట. తాను అడిగిన పెందుర్తి సీటులో మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకు అవకాశం ఇస్తున్నట్టు సుబ్బారెడ్డి ప్రకటించడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారట రమేష్ బాబు. కొంత కాలంగా పార్టీ నాయకత్వంతో ఉన్న గ్యాప్ కూడా ఈ పరిస్థితులకు కారణంగా చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడైనా, ఎమ్మెల్యే గా ఉన్నప్పుడైన రమేష్ బాబు వ్యక్తిగత దూషణలు, విమర్శలకు దూరం. ఎవరినీ అనను… ఎవరితోనూ పడను అనే విధానం ఆయనది.
కానీ… ఇప్పుడు టీడీపీ, జనసేనలపై విరుచుకుపడ్డం వైసీపీకి చాలా అవసరం. విశాఖ వంటి ముఖ్యమైన ప్రాంతంలో మంత్రి అమర్నాథ్ తప్ప మరో వాయిస్ వినిపించడం లేదు. పార్టీ అధ్యక్షుడుగా రమేష్ బాబు ఆ పని చేయడం లేదన్న అసంతృప్తి పెద్దలకు ఉందట. ఇక సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం సామాజిక వర్గాన్ని ఏకీకృతం చేయడంలో విఫలం అయ్యారనేది రమేష్ బాబుపై పార్టీ పెద్దలకున్న మరో అభిప్రాయం. ఐతే, కులాల వారీగా మీటింగ్ లు పెట్టడం, వారిని ఆకర్షించే ప్రయత్నం చేయవద్దని హైకమాండ్ అదేశించినందునే ఆ విధంగా వ్యవహరించానని చెబుతున్నారు పంచకర్ల. మొత్తంగా చూస్తే… పెందుర్తి విషయంలోనే రమేష్‌బాబు డీప్‌గా హర్ట్ అయ్యారని, జిల్లా పార్టీ అధ్యక్షుడికే సీటు గ్యారంటీ దిక్కులేనప్పుడు ఇక ఉండటం ఎందుకనుకుంటూ రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. హామీలపై స్పష్టత లేకుంటే.. మరికొంత మంది జారిపోవడం ఖాయం అనే చర్చ జరుగుతోంది. రమేష్ బాబు రాజీనామా పై ఇప్పటి వరకు పార్టీ పరంగా స్పందన లేకపోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోందట. ఈ పరిణామాలు ఎట్నుంచి ఎటు మారతాయో చూడాలి.