Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఆశావహులంతా జోరు పెంచారు. ఇప్పుడు తామున్న పార్టీలో టిక్కెట్ డౌటనుకుంటే… సేఫ్‌సైడ్ ముందే పక్క పార్టీలో కర్చీఫ్ వేసుకునే కార్యక్రమం జోరుగా జరుగుతోంది. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో సంప్రదింపుల ప్రకియ ఊపందుకుంది. కొత్త కొత్త సమీకరణలతో చేరికలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయంలో… కాంగ్రెస్ పార్టీ మీద వత్తిడి ఎక్కువగా ఉందట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి జూపల్లి మీదుగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి వరకు చేరికల వ్యవహారం కొనసాగుతోంది. అటు అధికార బీఆర్‌ఎస్ నుంచి కూడా ముఖ్య నాయకులు కొందరు గాంధీభవన్‌తో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
అంతా మనవైపు చూస్తున్నారు.. పార్టీకి ఊపు వస్తోంది. ఇక దున్నేస్తామని చెప్పుకోవడానికి బాగున్నా… చేరడానికి వచ్చే నాయకులతో కాస్త అప్రమత్తంగా ఉండండి బాబూ… అని పీసీసీకి వార్నింగ్ ఇస్తున్నారట టి కాంగ్రెస్ సీనియర్స్. అప్రమత్తంగా లేకుంటే… మొదటికే మోసం వస్తుందని చెబుతున్నారట. 2018 ఎన్నికల్లో గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ ఎపిసోడ్ టి కాంగ్రెస్‌ను బాగానే డ్యామేజ్ చేసింది. ఆ అనుభవంతోనే
ఎన్నికల ముంగిట్లో అడ్డగోలు చేరికల్ని ప్రోత్సహించవద్దని చెబుతున్నారట పెద్దోళ్ళు. ఎలక్షన్స్‌ని ఎదుర్కోవడానికి కేసీఆర్ రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారని, ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేయడం ఎలాగో కూడా ఆయనకు బాగా తెలుసునని, అందుకే అప్రమత్తంగా ఉండాలని సీనియర్స్ హెచ్చరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేతలు వ్యూహాత్మకంగా తమ మనుషులను కాంగ్రెస్‌లోకి పంపి రాజకీయ ఎత్తుగడలు అమలుచేసే అవకాశం ఉందని, ఆ విషయంలో అప్రమత్తంగా లేకుంటే దెబ్బతింటామని చెబుతున్నారు ఆ నేతలు.
బీఆర్‌ఎస్‌లో టికెట్ రాకుండా, లేదంటే అసంతృప్తితో బయటికి వచ్చామని చెప్పే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నది సీనియర్ల వాదన. 2018 ఎన్నికల్లోలాగా దెబ్బతినకుండా జాగ్రత్త పడాలని,పార్టీలో చేరిన అందరికీ సీట్లు కన్ఫామ్ చేయద్దని సూచిస్తున్నారు. కష్ట కాలంలో అండగా ఉన్న నాయకులను గుర్తించి టికెట్లు ఇవ్వాలని, కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నందున ప్రత్యర్థి పార్టీ కూడా సహజంగా ఎత్తుగడలు వేస్తుందన్న సంగతి మర్చిపోవద్దని సలహా ఇస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ కోవర్టులు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు చేరికల ముసుగులో ఎవరైనా వస్తే… ఇబ్బందులు తలెత్తకుండా పీసీసీ నాయకత్వం జాగ్రత్త పడాలన్న సలహాలు వస్తున్నాయి. మరి అధికార పార్టీ వ్యూహాలను పీసీసీ నాయకత్వం ఎలా పసిగడుతుందో.. చేరికల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.