Off The Record: మెదక్ బీఆర్‌ఎస్ టికెట్ తన కొడుక్కి ఇవ్వకపోవడంతో.. రగిలిపోయిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నిప్పులు చెరిగారు. తీవ్రంగా రగిలిపోయారు. తన కొడుక్కి టికెట్ రాకుండా చేశారంటూ.. ఘాటైన వ్యాఖ్యలతో రాజకీయాన్ని హీటెక్కించారు. ఆ పరిణామాలతో.. ఇక మైనంపల్లి టికెట్ కట్ అవుతుందని భావించారు అంతా. కానీ, వీటన్నిటినీ పట్టించుకోని కేసీఆర్ మైనంపల్లికే మల్కాజిగిరి టికెట్ ఇచ్చారు. ఆ తరువాత జరిగిన పరిణామ క్రమంలో చాలా మంది ఒకటి రెండు రోజుల్లో మైనంపల్లి ప్లేస్‌లో మరొకరిని ఖరారు చేస్తారని, ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తారని అనుకున్నారు. అలాంటివేం జరగలేదు. ఇంకా బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారు మైనంపల్లి. కొడుకు రోహిత్ మెదక్ నుంచి పోటీచేసి తీరుతాడని బహిరంగంగానే చెప్పారు. మల్కాజ్‌గిరిలో మైనంపల్లి, మెదక్‌లో కొడుకు రోహిత్ టూర్లు కొడుతూనే ఉన్నారు. బిఆర్‌ఎస్ క్యాడర్ అంతా తమతోనే ఉందని చెబుతూ.. వారితో పాటు జెడ్పీటీసీలు, ఎంపిటీసీలు, సర్పంచ్‌లు, చైర్మన్లు, కార్పోరేటర్లు అందరినీ వెంటేసుకుని తిరుగుతున్నారు. క్యాడర్ కూడా పార్టీ వ్యవహారాల గురించి పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకున్నా సై అంటున్నారు.
ఈ పరిస్థితుల్లోనే హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న ప్రచారం ఇటీవల ఊపందుకుంది. ఒకవైపు మల్కాజ్‌గిరి టిక్కెట్ వరకు మైనంపల్లికి ఢోకా లేదు. బీఆర్‌ఎస్ అభ్యర్దిని మార్చలేదు. తీవ్ర వ్యాఖ్యలు చేసినా… పార్టీ నుంచి ఆయన్ని సాగనంపలేదు. ఈ లోగానే కాంగ్రెస్… మల్కాజిగిరి, మెదక్ టికెట్లను తండ్రి కొడుకులిద్దరికీ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయినా…. ఇంకా మైనంపల్లి ఏ డిసిషన్ చెప్పలేదంటున్నారు. ఇంతకీ మైనంపల్లి మల్కాజ్‌గిరి నుంచి ఏ పార్టీ తరపున పోటీచేప్తారు? కొడుకును మెదక్ బరిలోకి దింపుతారా? అసలు బిఆర్‌ఎస్‌లోనే ఉంటారా? కాంగ్రెస్ ఆఫర్‌ను కాదంటారా? ఆయన విషయంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న ప్రశ్నలన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఇవన్నీ ఇప్పుడిప్పుడే తేలేలా కనిపించడం లేదు. అయితే క్యాడర్‌ను కంట్రోల్‌లో పెట్టుకున్న హన్మంతరావు కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూసిన తరువాతే తన భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తనను బలవంతంగా పార్టీ నుంచి బయటకు పంపినా, లేదా తనకు కాకుండా మరొకరికి టికెట్ ఇచ్చినా అప్పుడు ఇతర మార్గాల గురించి ఆలోచిస్తానని క్యాడర్‌కు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అయితే సైలెంట్ అయిన మైనంపల్లి ఇది తుఫాన్ ముందు ప్రశాంతత అంటున్నారట. ముందు ముందు ఆ తుఫాన్ ఎలా మారుతుందో చూడాలి మరి.