Off The Record: పొలిటికల్ ఫైర్ బ్రాండ్ మోత్కుపల్లి నర్సింహులు తన అసంతృప్త స్వరాన్ని పెంచారు. తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో అధినేత కేసీఆర్ పై గుర్రుగా ఉన్న మోత్కుపల్లి….. ఆయన దగ్గరే తన పంచాయతీ తేల్చుకునేందుకు సిద్ధం అయ్యారు. కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో డెడ్ లైన్ పెడుతూ.. ఓ వీడియోను చేరవేశారాయన. నన్ను ఎందుకు పార్టీలో చేర్చకున్నారు? ఎందుకు పక్కన పెట్టారు?. ఆరు సార్లు శాసన సభకు ప్రాతినిధ్యం వహించిన నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అంటూ ప్రశ్నలు సంధించారట. తుంగతుర్తి లేదా ఆలేరు టికెట్ వస్తుందని ఆశించాను. కానీ… టికెట్ ఇవ్వలేదు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న 25మంది ఓడిపోతారని తెలిసి కూడా వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. మరి ఏ మచ్చాలేని, మాదిగ సామాజిక వర్గానికి చెందిన నన్ను ఎందుకు నిర్లక్ష్యం చేశారు? మీరు దూరంపెట్టడంతో నేను తీవ్ర మానసిక్ష క్షోభకు గురవుతున్నానంటూ ఆ వీడియో సందేశంలో పేర్కొన్నారు మోత్కుపల్లి.
వీడియో సందేశం పంపించినప్పటికీ రెస్పాన్స్ లేకపోవడంతో ఇక అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారట. నేడో రేపో మీడియా ముందుకు వచ్చి కేసీఆర్‌పై నిప్పులు కక్కాలని కూడా నిర్ణయించుకున్నారట మోత్కుపల్లి. సీనియర్ నేత అసంత్రుప్తి ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన మోత్కుపల్లి నర్సింహులు.. కాంగ్రెస్ కు, అక్కడి నుంచి తిరిగి టీడీపీకి, అటు నుంచి అటు బీజేపీకి.. అక్కడి నుండి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మోత్కుపల్లి నర్సింహులు సేవలు వినియోగించుకుంటామని ఆయన చేరిక సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడంతో.. ఎమ్మెల్యేగా ఎక్కడా సర్దుబాటు చేయలేకపోతే, ఎమ్మెల్సీ పదవైనా దక్కుతుందని అంతా భావించారు. కానీ.. పార్టీలో చేరిన తర్వాత ఒకటీ రెండు సార్లు మినహా మళ్లీ సీఎం కేసీఆర్ ను కలిసే అవకాశమే మోత్కుపల్లికి దక్కకపోవడం.. అధినేత నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన నర్సింహులు అధినేతకే తన అసంత్రుప్తిని వీడియో సందేశంలో పంపారట. తాజాగా మోత్కుపల్లి నరసింహులు అసంత్రుప్త స్వరం ఎక్కడికి దారితీస్తుందో అనే ఆందోళన బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుందట. ఆయన భవిష్యత్ కార్యచరణ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
సీనియర్ నేత పార్టీ లైన్ లోనే ఉంటారా… లేక గీత దాటుతారా అనే సందేహం వ్యక్తం అవుతున్నందున… గీత దాటితే పరిణామాలు ఎలా ఉంటయోననే చర్చకూడా జరుగుతోంది. గతంలో పార్టీలు టికేట్ ఇవ్వకపోతే… ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఆలేరు ప్రజలు నన్ను ఆదరించారు… అని కొద్ది నెలల క్రితమే అన్నారు మాజీ మంత్రి. ఈ పరిస్థితుల్లో ఆయన ఆలేరు నుంచి మరోసారి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. దీంతోపాటే పార్టీ మార్పుపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి… ఆలేరు లేదా… ఎస్సీ రిజర్వుడ్ తంగతుర్తి నుండి కూడా ఆయన పోటీ చేసే చాన్స్ ఉందంటున్నారు. మొత్తంగా సీనియర్ నేత మోత్కుపల్లి ఆలక ఎక్కడికి దారితీస్తుంది, ఎన్ని మలుపులు తిరుగుతుంది.. ఎన్ని ప్రశ్నలను లేవనెత్తబోతోంది? ఈ క్రమంలో ఎన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయో అనే చర్చ, రచ్చ జరుగుతోంది. ఈ వ్యవహారం ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ లో పోలిటికల్ హీట్ పెంచుతోంది.