Off The Record: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్టయి 100 రోజులకు పైగా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఈ వంద రోజుల్లో మిగతా వ్యవహారాల సంగతి ఎలా ఉన్నా… నిజామాబాద్ జిల్లా బీఆర్‌ఎస్‌కు మాత్రం ఆమెలేని లోటు గట్టిగానే కనిపిస్తోందంటున్నారు. తాను యాక్టివ్‌గా ఉన్న రోజుల్లో జిల్లా రాజకీయాలను అంతా తానై నడిపిన కవిత ఇప్పుడు అందుబాటులో లేకపోవడంతో… తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయన్న ఆవేదనలో ఉన్నారట ఉమ్మడి నిజామాబాద్ కారు పార్టీ నేతలు. ఆమె ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అంటూ అందరికంటే ఎక్కువగా వాళ్ళే కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నట్టు చెబుతున్నారు. కవిత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నంత కాలం ఓ వెలుగు వెలిగారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా చేసిన ఆమెకు… ఆ పదవుల కంటే, కేసీఆర్ కూతురుగా వచ్చిన హోదానే ఎక్కువగా ఉండేదట.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులందరికీ ఆమే పెద్ద దిక్కుగా ఉండేవారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా మందీ మార్బలంతో హడావుడి చేసేవారు ఆమె. ఎమ్మెల్యేలు సైతం పనుల కోసం కవిత ఇంటి వద్ద గంటల కొద్దీ పడిగాపులు పడ్డ సందర్భాలు ఉన్నాయట. ఓ మోస్తరు నాయకులు, కార్యకర్తలైతే… మేడం దర్శనభాగ్యం కలిగితే చాలన్నట్టుగా ఉండేవారన్నది లోకల్ టాక్. అయితే.. అదంతా గతం. ఇన్ని రోజులు కవిత ముందు వినయ విధేయతలు ప్రదర్శించి, ఆమె మెప్పు పొందేందుకు తాపత్రయపడ్డ నాయకులు ఇప్పుడు ఎవరి ఎవరి దారి వారు చూసుకుంటున్నారట. ఇంకతా చెప్పాలంటే… ఓ దిశా నిర్దేశం లేక, భవిష్యత్‌పై భరోసా కుదరక అంతా మెల్లిగా సర్దుకుంటుండటంతో… జిల్లా పార్టీ కకావికలం అవుతోందని అంటున్నారు. కవిత జైలుకు వెళ్ళడం, పార్టీ నేతలకు దిశా నిర్దేశం లేకపోవడం వల్లే… మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ విజయం మరింత తేలికైందన్న వాదన సైతం ఉంది జిల్లాలో. అర్వింద్ ను వెంటాడి మరీ ఓడిస్తానని శపథం చేసిన కవిత ఎన్నికల నాటికి జైలులో ఉండిపోవడం పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చిందంటున్నారు.
ఎన్నికల్లో ఆమె ప్రభావం సంగతి తర్వాత.. కనీసం ఫ్లెక్సీల్లో మేడమ్ ఫోటో పెట్టడానికి కూడా ఇష్టపడలేదట లోకల్ బీఆర్‌ఎస్ నేతలు. ఆ పరిస్థితుల్లోనే క్రాస్ ఓటింగ్ జరిగి బీఆర్‌ఎస్ ఘోరంగా ఓడిపోయిందన్న అభిప్రాయం ఉంది. ఇక లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కరే పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. కీలక నేత పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం కోలుకోలేని దెబ్బ కొట్టిందట. తర్వాత ద్వితీయ శ్రేణి నేతలు పోచారం బాట పట్టారు. కొందరు మాజీలు కూడా పోచారం వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కవిత అనుచరులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సైతం పక్క చూపులు చూస్తున్నారట. కవిత బ్రాండ్ గా ఉన్న తెలంగాణ జాగృతి కూడా చెల్లాచెదురవుతోందని అంటున్నారు. అక్క జైలుకెళ్లి వందరోజులు గడిచింది.. ఇంకా ఎన్నిరోజులు ఉంటుందో తెలియదు.. ఆ లోపు బీఆర్ఎస్ ఖాళీ అవుతూ వస్తోంది. ఇక మేం మాత్రం ఇక్కడుండి చేసేదేనుందని ద్వితీయ శ్రేణి నేతలు సైతం సన్నిహితులతో అంటున్నట్టు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని మధనపడుతున్నారట గులాబీ పెద్దలు. ఆమె లేని లోటును భర్తీ చేసేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు ప్రచారం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల లోపు కవిత జైలు నుంచి బయటికి వస్తే… ఆమె జిల్లాలోనే కొన్నాళ్ళు మకాం వేసి పార్టీని పటిష్టం చేయడం ప్లాన్ ఎ. ఒక వేళ అప్పటిలోగా ఆమె రాకుంటే… కేటీఆర్ లేదా హరీష్ రావులలో ఒకరిని నిజామాబాద్ ఇంచార్జ్‌గా నియమించి ప్లాన్ బీ ని తెర మీదికి తేవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఏ ప్లాన్ అమల్లోకి వస్తుందో చూడాలంటున్నారు స్థానిక నేతలు.