Off The Record: గుమ్మనూరు జయరామ్.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఏపీ మంత్రి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జయరామ్‌కు ఇపుడు అక్కడే కష్టాలు పెరుగుతున్నాయట. సెగ్మెంట్‌లో తనకు ప్రత్యామ్నాయంగా తయారవుతున్న నేతల సంఖ్య పెరగడం ఆయనకు మింగుడు పడటం లేదట. వైసీపీ అధిష్టానం కూడా ఆలూరులో ఇప్పటికే ఉన్న వేరే నాయకులతో పాటు కొత్త వారిని కూడా ప్రోత్సహిస్తున్నట్టు స్థానికంగా చెప్పుకుంటున్నారు. అందులో మంత్రి జయరామ్ సామాజికవర్గానికి చెందిన వారు కూడా ఉండటంతో ఈసారి మంత్రికి టిక్కెట్ డౌట్‌లో పడిందన్నది లోకల్ టాక్.
స్థానికంగా జడ్పీటీసీ విరుపాక్షి మంత్రితో విబేధించి పక్కల్లో బల్లెంలా తయారయ్యారు. పార్టీలో అణచివేత ధోరణి ఎక్కువై జడ్పీటీసీగా పని చేయలేని స్థితి కల్పించారని మంత్రితోపాటు ఆయన సోదరులపైనా ఆరోపణలు చేసి రాజీనామాకు సిద్ధమయ్యారు విరూపాక్షి. తర్వాత పార్టీ పెద్దలు నచ్చచెప్పి మంత్రితో రాజీ కుదిర్చారట. ఆర్థికంగా బలంగా ఉన్న ఉన్న విరుపాక్షి వాల్మీకి సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో మంత్రికి పోటీగా ఆలూరు టికెట్ రేసులో ఉన్నట్టు తెలిసింది. తాజాగా వాల్మీకి సామాజిక వర్గానికే చెందిన కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు కుమార్తె బొజ్జమ్మ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. నియోజకవర్గం మొత్తం తిరగాలని ఆమెకు చెప్పిందట వైసీపీ అధిష్టానం. మంత్రి ఉండగా బొజ్జమ్మను నియోజకవర్గం అంతా తిరగాలని చెప్పారంటే…. ఈసారి ఆయనకు టిక్కెట్ రాదని పరోక్షంగా చెప్పినట్టేనని ప్రచారం చేస్తున్నారట ప్రత్యర్థులు. ఆలూరు అభ్యర్థిగా తమకు అవకాశం వస్తుందని బొజ్జమ్మ సన్నిహితులు చెబుతున్నారట. ఇక మాజీ ఎమ్మెల్యే నీరజరెడ్డి కుమార్తె , ఎన్నారై హిమవర్ష కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆలూరులో మంత్రికి ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నంలో ఉన్న హిమవర్ష రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారట. ఈ పరిణామాలపై మంత్రి జయరామ్ వర్గం అసహనంతో వుంది. అందుకే… వైసీపీలో ఎవరు చేరినా గుమ్మనూరుకు ప్రత్యామ్నాయం కాలేరని ఘాటుగా సమాధానం ఇస్తున్నారట.
పైకి ఎంత గంభీరంగా మాట్లాడుతున్నా… ఒకవైవు వివాదాలు, మరోవైపు సొంత పార్టీలో పరిణామాలు మంత్రి జయరామ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. బొజ్జమ్మ వైసీపీలో చేరడం మంత్రికి ఇష్టం లేదట. అయినా పట్టించుకోకుండా పార్టీ అధిష్టానం డైరెక్ట్ గా మాట్లాడి కండువా కప్పిందట. ఎన్నారై హిమవర్ష రెడ్డికి కూడా అధిష్టానం నుంచి ప్రోత్సాహం వుందట. మరోవైపు వాల్మీకి సామాజికవర్గానికే చెందిన జడ్పీటీసీ విరూపాక్షి నియోజకవర్గంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాలిపోయి ఆలయాలు, చర్చిలు, మసీదులు, వేడుకలు, క్రీడలు…ఇలా అన్నింటికీ ఆర్థికసాయం చేస్తూ ప్రత్యామ్నాయం నేనేనని చెబుతున్నారట. ఈ మొత్తం పరిణామాలు మంత్రి జయరామ్ కు కష్టాలు తెచ్చి పెడుతున్నాయట. దీంతో ఈసారి ఆయనకు అసలు టిక్కెట్ వస్తుందా? రాదా? అన్న అనుమానాలు నియోజకవర్గంలోనే పెరుగుతున్నాయి.